రామగిరి/భువనగిరి కలెక్టరేట్ : డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 15, 16న నిర్వహించే గ్రూప్ -2 పరీక్షకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో రెండు పట్టణ ప్రాంతాల్లో 87 పరీక్ష కేంద్రాలను (నల్లగొండలో 59, మిర్యాలగూడలో 28) ఏర్పాటు చేయగా 29,174 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9:30, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఆయా పరీక్ష కేంద్రాల లోపలికి అభ్యర్థులను అనుమతించరు. దీని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులందరికీ ప్రతి పరీక్షకు వేర్వేరుగా బయోమెట్రిక్ హాజరు ఉంటుంది.
పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష ముగిసే వరకు నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రంలోని అధికారులు, సిబ్బంది విధిగా ఐడీ కార్డులు ధరించాల్సి ఉంటుంది. పరీక్ష మెటీరియల్స్ తరలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో ఇన్విజిలెటర్స్ ఓఎంఆర్ షీట్ పూర్తి చేసే విధానంపై అవగాహన కల్పిస్తారు. దాని తర్వాతే పూర్తి చేయాల్సి ఉంటుంది. తప్పలు చేస్తే సరిచేయడానికి అవకాశం ఉండదు. సూర్యాపేట జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు (సూర్యాపేటలో 30, కోదాడలో 19) ఏర్పాటు చేయగా 16,857 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,078 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
వీటితో రావాలి..
గ్రూప్-2 అభ్యర్థులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ హనుమంతరావు
గ్రూప్ -2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ తమ సెంటర్లను ఒకరోజు ముందుగా చూసుకోవాలని, పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,078 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.