రామన్నపేట, ఏప్రిల్ 06 : రామన్నపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకుని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నదని, ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసి నిండిపోతున్నవని ధాన్యం కొనుగోలు ప్రారంభించక పోవడంతో గతంలో మాదిరిగా అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
వెంటనే కొనుగోలు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండా త్వరగా కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని దీనికోసం అధికార యంత్రాంగం చొరవ చూపాలన్నారు. నెలల తరబడి ధాన్యం రాశులు మార్కెట్ కేంద్రాల్లో నిలువ ఉండడంతో రైతులకు పట్టాల కిరాయి ఎక్కువై ధాన్యం తడిసి రంగు మారుతుండడంతో రైస్ మిల్లు యజమాన్యం కోతలు విధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఆర్థికంగా రైతు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని, గన్నీ బ్యాగుల కొరతను నివారించాలని మార్కెట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, లారీల కొరత లేకుండా చూడాలన్నారు.
అలాగే ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేసి జూన్ నెల నాటికల్లా రామన్నపేట ప్రాంత రైతులకు నీరు అందివ్వాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా బోయిని ఆనంద్, మండల కార్యదర్శిగా గన్నేబోయిన విజయభాస్కర్, ఉపాధ్యక్షులుగా కందుల మల్లారెడ్డి, తాళ్లపల్లి జితేందర్, మండల కమిటీ సభ్యులుగా కొమ్ము అంజమ్మ, కరకంటి మల్లయ్య, బోల్ల వెంకన్న, దేవరపల్లి భిక్షం రెడ్డి, దాడి మల్లారెడ్డి, సిల్వర్ రాజు, తాడూరి కిష్టయ్య, కాకులారపు కల్పన, గంగాదేవి అంజయ్య, బండ జగన్మోహన్ రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.