భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 02 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. విద్యార్థులపై అక్రమంగా బనాయించిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ భూములను ప్రభుత్వం పరిరక్షించాలి. కానీ ప్రభుత్వం వాటిని అభివృద్ధి పేరుతో అమ్మకాలు జరపవద్దని అన్నారు. భూమి అమ్మకాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు మంచాల మధు, నాయకులు బుగ్గ లక్ష్మయ్య, వడ్డేపల్లి యాదగిరి, జంగారెడ్డి, పాండురంగారెడ్డి, అనసూయ, సాయి, వెంకటేశ్, శ్రీరాములు, సోమయ్య పాల్గొన్నారు.