యాదగిరిగుట్ట, జూన్6: ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా ఆ పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ప్రజాపాలన అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎందుకు ముందస్తు అరెస్టులు చేశారో చెప్పాని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తున్నారని గ్రామాలలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచుల, పాడి రైతులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. తెల్లవారుజామూనే ఇంటికి వెళ్లి ఉన్నఫలంగా అరెస్టు చేయడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు.
పదేళ్ల పాలనలో ఇంత ధారుణమైన పరిస్థితులను చూడలేదన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి నాడు కేసీఆర్ 22 సార్లు వచ్చారు. ఏ ఒక్కరోజూ కూడా పట్టణంలో ఉన్న ఏ కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ప్రజాపాలన గొప్పలు చెబుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. ఒక్కొక్క బస్సుకు ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టి రేవంత్రెడ్డి సభకు తరలించారు. జిల్లా కలెక్టర్ దీనిపై పునరాలోచన చేయాలన్నారు. అధికారం శాశ్వతం కాదు. ఎప్పటికైనా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.