శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 25: ప్రేమ విఫలమై ఓ యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ఫ్లాట్ నంబర్ 404లోని తన మామ ఇంట్లో నివాసం ఉంటున్న కోమలి బోను(21) మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్నది. ఆమె యూట్యూబర్‌గా కూడా పేరు తెచ్చుకున్నది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్‌గా రాణిస్తున్న అఖిల్‌రెడ్డితో కోమలికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో మూడేండ్లుగా ఇద్దరూ ప్రేమించుకోగా, ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో సంవత్సరం కింద బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.
అఖిల్‌రెడ్డితో ఏర్పడిన విభేదాలతో మనస్తాపానికి గురైన కోమలి గతంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు రక్షించారు. అఖిల్‌ను మరిచిపోలేకపోయిన కోమలి రెండు రోజుల క్రితం ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కోమలి ఈనెల 23న రాత్రి చిత్రపురి కాలనీలోని తమ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.