గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చడం దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నది. సున్నాయేగా మారింది అనుకుంటే సరిపోదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మార్పు చోటుచేసుకోవడం వెనుక భాష, చరిత్ర, అస్తిత్వంతో అల్లుకున్న రాజకీయాలున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు కేరళ శాసనసభ ’కేరళం’ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా, వామపక్ష ప్రభుత్వం దానిని కేంద్రానికి పంపింది. ఇది జరిగింది 2024 జూన్ 24న. అంతకుముందు 2023లోనూ ఇలాంటి తీర్మానమే పంపితే అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హఠాత్తుగా ఈ తీర్మానం దుమ్ము దులిపింది. క్యాబినెట్లో పెట్టి మెరుపువేగంతో ఆమోదింపజేసింది. ఇక పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరుగడమే తరువాయి. పేరు మార్పిడి రాజకీయాలకు పెట్టింది పేరైన బీజేపీ ఎన్నికల సమయాన్ని ఇందుకు ఎంచుకోవడం గమనార్హం. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే అధికారం బంతాట సాగే ఈ దక్షిణాది రాష్ట్రంలో కాలు మోపాలని బీజేపీ నానా తంటాలు పడుతున్నది. కేరళ అస్తిత్వంతో ముడివడి ఉన్న అంశంలో సానుకూల స్పందన ద్వారా బయటి పార్టీ అన్న ముద్రను చెరిపేసుకోవాలనేదే బీజేపీ అవకాశవాద తాపత్రయం.
బెంగాల్‌ను తూర్పు, పశ్చిమంగా బ్రిటిష్‌వారు విభజించిన సంగతి తెలిసిందే. దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ఈ విభజన మలుపు తిప్పింది. అయితే రెండు ముక్కలు భారత్‌లో ఉన్నప్పుడు ఈ దిక్కుల తోకలు ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ, తూర్పు బెంగాల్ దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో లీనమై, ఇప్పుడు బంగ్లాదేశ్‌గా మనుగడ సాగిస్తున్నది. దేశంలో ఒకే రాష్ట్రం మిగిలినప్పుడు ఇంకా పశ్చిమ ఎందుకనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఫైర్ బ్రాండ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రం పేరును బాంగ్లాగా మార్చాలని చాలాకాలం నుంచి అంటున్నారు. కేరళం ఆమోదం పొందిన నేపథ్యంలో మరోసారి వంగభూమి పేరు మార్పిడిపై చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ అనేకసార్లు పేరు మార్పిడిపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది. వాటిల్లో రాష్ట్రం పేరును పశ్చిమ బంగ లేద బాంగ్లాగా మార్చాలని సూచించారు. చివరి తీర్మానం 2018లో వెళ్లింది. అయినా కేంద్రం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. కేరళ విషయంలో ఒకలాగా, బెంగాల్ విషయంలో మరోలాగా కేంద్రం అనుసరిస్తున్న రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనం.
మన దేశంలో అయితే పేర్ల మీద, విగ్రహాల మీద వివాదాలు కోకొల్లలుగా పుట్టుకు వస్తుంటాయి. అందుకు వలసపాలన కొంతవరకు కారణం. బ్రిటష్ పాలన అంతరించాక కూడా ఆ కాలంనాటి విగ్రహాలు ఉంచాలా? ఇంగ్లిష్ భాష కారణంగా అపభ్రంశం పొందిన పేర్లను తిరిగి మనవైన రీతిలో మార్చుకోవాలి కదా? ఈ తరహా ఆలోచనలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయి. మద్రాస్ చెన్నై అయ్యింది. బొంబాయి ముంబైగా మారింది. విక్టోరియా టర్మినస్ (వీటీ).. ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)గా మారింది. ఈ పేర్ల మార్పిడి అనేది బీజేపీ హయాంలో వెర్రితలలు వేస్తున్నది. ఢిల్లీలో రాజవీధుల పేర్లను ఎడాపెడా మారుస్తూపోయిన బీజేపీ ఈ మధ్య విగ్రహాలపై కూడా పడింది. ఢిల్లీ నగర రూపశిల్పి ఎడ్వర్డ్ ల్యూటెన్స్ విగ్రహాన్ని రాష్ట్రపతి భవన్ ఆవరణలో నుంచి తొలగించి ఆ స్థానంలో భారతీయ ప్రథమ గవర్నర్ జనరల్ రాజాజీ విగ్రహాన్ని పెట్టడం విమర్శల పాలైంది. ల్యూటెన్స్ ఓ ఆర్కిటెక్ట్. ఆయన వైస్రాయి కాదు కదా అని ఆయన మునిమనుమడు ఆవేదన వ్యక్తం చేశారు. అస్తిత్వంతో ముడివడిన సందర్భాల్లో పేరు మార్పిడిని (లేదా విగ్రహాల తొలగింపును) ఆమోదించవచ్చు. కానీ అనవసర వివాదాలతో పేర్లపై రాజకీయం చేయడం దేశానికి ఏ రకంగానూ ఉపయోగకరం కాదు. ఎందుకంటే పేరును మారిస్తే చరిత్ర చెరిగిపోదు.