Gen Z with Instagram | ఒకప్పుడు కొత్త దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్‌లు, ఫ్యాషన్ బ్రాండ్ల గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, కుటుంబసభ్యులను అడిగేవారు. లేదంటే ప్రకటనలను చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా జెన్‌జీ యువత ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా ముందుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌నే చూస్తున్నారు. సోషల్‌మీడియాలో పోస్టులను చూసిన తర్వాతనే ఏ ప్రొడక్ట్ అయినా కొనాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సోషల్ మీడియా దిగ్గజం మెటా నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం.. దేశంలోని 23 నగరాల్లో 4 వేల మందికిపైగా వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫలితాల్లో బ్యూటీ, ఫ్యాషన్‌కు సంబంధించి వీడియోలకు అత్యధిక రెస్పాన్స్ వస్తున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యధికంగా బ్యూటీ, మేకప్, ఫ్యాషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కంటెంట్‌నే ఎక్కువగా చూస్తున్నారని తెలిసింది.
ఈ అధ్యయనం ప్రకారం సుమారు 52 శాతం మంది వినియోగదారులు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన రీల్స్‌ను తరచచూ చూస్తున్నామని తెలిపారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు బ్రాండ్ ఉత్పత్తులపై రివ్యూలు ఇవ్వడం, కొత్త బ్రాండ్లను పరిచయం చేయడం, వారి అనుభవాలను పంచుకోవడం వంటి అంశాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు నివేదికలో తెలిసింది.
ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. రీల్స్ వీక్షణలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 98 శాతం మంది వినియోగదారులు ప్రతిరోజూ వీడియోలు చూస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 94 శాతంగా నమోదైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు కూడా పట్టణ ప్రాంతాలవారు ఇష్టపడే అదే తరహా కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అంటే డిజిటల్ వినియోగంలో నగరాలు, గ్రామాల మధ్య ఉన్న అంతరం క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతుంది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను కేవలం వినోదంగా భావించినప్పటికీ.. అవి యూజర్ల కొనుగోలు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కొత్త ఉత్పత్తి లేదా బ్రాండ్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ముందుగా రీల్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అధ్యయనం ప్రకారం.. 81 శాతం మంది యూజర్లు కొత్త ఉత్పత్తి లేదా బ్రాండ్ గురించి తొలిసారిగా రీల్స్ ద్వారానే తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే 66 శాతం మంది ఏ వస్తువునైనా కొనే ముందు రీల్స్‌లో అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక 47 శాతం మంది తుది కొనుగోలు నిర్ణయంపై కూడా రీల్స్ ప్రత్యక్ష ప్రభావం చూపినట్లు అంగీకరించారు.
ఈ ధోరణిలో ముఖ్యంగా జెన్‌జీ ముందంజలో ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న జెన్ జీ వినియోగదారుల్లో 89 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ చూస్తున్నట్లు తెలిపారు. అలాగే 84 శాతం మంది కొత్త ఉత్పత్తులు, బ్రాండ్ల గురించి తెలుసుకునేందుకు మెటా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి నేటి యువతకు కొత్త ట్రెండ్లు, ఫ్యాషన్ స్టైల్స్, మేకప్ ఉత్పత్తులు లేదా ఫిట్నెస్ చిట్కాల గురించి తెలుసుకునే ప్రధాన వేదికగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్‌మీడియా షార్ట్స్ మారిపోయాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.