దామరచర్ల, జూన్ 17 : పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. విద్య వ్యాపారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను సేవా భావంతో చూడాల్సిందిపోయి పర్మిషన్ తీసుకున్న పాఠశాల, కళాశాల యాజమాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మార్చాయని ఆరోపించారు.
పేద విద్యార్థులు నాణ్యమైన విద్య పొందాలంటే లక్షల రూపాయలు చెల్లించి కుటుంబాలు అప్పుల కుప్పగా మారి రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించి పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే విధంగా చూడాలన్నారు. లేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను సమీకరించి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దర్శనం వినయ్, పోలేపల్లి ధరణ్ తేజ్, నాని, గౌతమ్, ప్రభు, కిరణ్, యశ్వంత్, సాయి పాల్గొన్నారు.