ఆలేరు టౌన్, ఆగస్టు 30 : తాజా కూరగాయలు, నాణ్యమైన పప్పులనే వంటలకు వినియోగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిర్వాహకులకు సూచించారు. ఆలేరు పట్టణ పరిధిలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ వెంకటమ్మ, మానిటరింగ్ కమిటీ సభ్యులు, విద్యార్థులతో కలిసి వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు రోజు వండే ఆహార పదార్థాలు, పప్పు దాన్యాలు, కూరగాయలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
వంటగది ప్రక్కన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ప్రహరీ కూలిపోవడంతో మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ ఈఈకి ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి రోజా రాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.