హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : విద్యావ్యవస్థలో మార్పులకు ఉన్నత విద్యామండలి చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 30 కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటి వరకు 120 కాలేజీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ మండలికి దరఖాస్తు చేశాయి. 2026-27 విద్యాసంవత్సరంలో డిగ్రీలో 19, పీజీలో 11 చొప్పున 30 కొత్త కోర్సులను ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టనున్నది. ఈ కోర్సులను ప్రవేశపెట్టే కాలేజీలు ముందు సంబంధిత పరిశ్రమలు/సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. కోర్సులో చేరిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించాలి. కోర్సు పూర్తైన తర్వాత ప్లేస్మెంట్ కల్పించాలి. ఇలాంటి ప్రత్యేకతలు గల కోర్సులు నిర్వహించేందుకు కాలేజీలు పోటీపడుతున్నాయి. కోర్సుల అనుమతి విషయంలో మండలి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కొత్త కోర్సులపై మంగళవారం కాలేజీలు, ఫ్యాకల్టీ, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. టీసాట్లో మధ్యా హ్నం 3 నుంచి 5గంటల వరకు కొత్తకోర్సుల ప్రత్యేకతలు, లాభాలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ వివరిస్తారు. ఈ కోర్సుల నిర్వహణపై సూచనలు స్వీకరిస్తారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆయా కాలేజీలకు మరోసారి ఓరియంటేషన్ నిర్వహిస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించే పూర్తి బాధ్యత కాలేజీలదేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. కాలేజీలు బాధ్యత తీసుకొని విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, క్లాసులు, పరీక్షలు పెట్టి విద్యార్థులను నిరుద్యోగులుగా మార్కెట్లోకి పంపిస్తామంటే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కోర్సులకు అనుమతి ఇచ్చేటప్పుడే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు వివరించి, ఆ తర్వాతే కాలేజీలకు అనుమతించనున్నట్టు తెలిపారు.