లక్ష్మణచాంద, జూలై 24 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ జిల్లా యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం, నర్సాపూర్(డబ్ల్యూ)కు చెందిన గన్ను శ్రీనివాస్‌రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి (24) ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో ఉంటున్నాడు. గత శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో నిత్యానందరెడ్డి తలకు తీవ్రగాయమైంది. స్నేహితులు వెంటనే దవాఖానకు తరలించారు. ఈ నెల 23న నిత్యానందరెడ్డి పుట్టినరోజు వేడుకలను దవాఖానలోనే స్నేహితులు నిర్వహించారు. అదే రోజు పరిస్థితి విషమించడంతో బ్రెయిన్‌డెడ్ అయి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.