పరీక్షలు ఎట్ల రాయాల్నో ‘చాయ్‌పే చర్చ’ పెట్టే మోదీ.. లీక్‌లపై మాత్రం మాట్లాడరెందుకు? కేవలం పేపర్ లీక్‌ల గురించే కాదు.. 12 ఏండ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలపై యువత ఆగ్రహంతో ఉన్నది. వాళ్లు జవాబుదారీతనం కోసం అడుగుతున్నరు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తమని ఇవ్వనందుకు ఆగ్రహంతో ఉన్నరు. కానీ, మీరేం చేశారు? మేకిన్ ఇండియా అడిగితే.. లీకిన్ ఇండియా ఇచ్చిండ్రు!
మోదీజీ.. వారేమైనా మీ ప్రధానమంత్రి, కేంద్రమంత్రి కుర్చీ అడిగిండ్రా? న్యాయం చేయాలని, భవిష్యత్తును కాపాడాలని అడుగుతున్నరు. విశ్వగురువు ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీస్తున్నరు. ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్నవారిని ఉగ్రవాదులు, దేశద్రోహులని, పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయని కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. నిజంగా కేంద్రానికి బాధ్యత, చిత్తశుద్ధి ఉంటే ఉద్యమిస్తున్న విద్యార్థుల వద్దకెళ్లి చర్చలు జరిపి, సమస్యను ఎప్పుడో పరిష్కరించేది – కేటీఆర్
హైదరాబాద్, జూలై 24 (నమస్తేతెలంగాణ): ‘మోదీ గారూ.. ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకున్నరు.. కొరివితో తలగోక్కున్నరు..తరం మారుతున్నది..స్వరం మారుతున్నది..నవతరం వరుస మారుతున్నది..అవమానపడ్డ కాక్రోచ్‌లే ఈ రోజు ఢిల్లీపై దండయాత్ర చేస్తున్నయ్..యువత పొట్టుపొట్టు కోపంతో ఉన్నరు..నీ ప్రభుత్వాన్ని మెట్టుమెట్టు ఎక్కి తొక్కుతరు.. జెన్‌జీ తలుచుకుంటే శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు కుప్పకూలినయ్..ఈ యువతరం సీబీఐ,ఈడీ, ఐటీలకు భయపడదు.. వారికి ఏ రాజకీయ పార్టీ అండలేదు..రాజ్యమా ఉలికిపడు..జర జాగ్రత్తగా ఉండు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
‘బీజేపీని మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చింది’ అంటూ ఎద్దేవాచేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి మహానగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువతీ యువకులు దండుకట్టి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పరీక్ష పే చర్చ పెట్టిన మీరు పేపర్ లీకేజీలపై ఎందుకు పెట్టలేదు? ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?’ అని నిలదీశారు. ఢిల్లీలో పిల్లలపై దాడులను చూస్తుంటే ఇద్దరు పిల్లల తండ్రినైన తన మనస్సు చలించిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వాలపై తనదైన శైలిలో పంచులు విసిరారు. ఢిల్లీలో యువతపై మోదీ సర్కార్ సాగిస్తున్న దమనకాండను కండ్లకుకట్టారు. రేవంత్ దాగుడు మూతలను ఎత్తిచూపారు. ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్న యువకులపై ఉగ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే ఉద్యమిస్తున్న విద్యార్థుల వద్దకెళ్లి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సి ఉండేదని స్పష్టంచేశారు.
12 ఏండ్లుగా మోసాలపైనే యువత ఆగ్రహం
యువతరం ఆందోళన కేవలం పేపర్ లీక్‌ల గురించే కాదని, 12 ఏండ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, దగాపైనే వారు ఆగ్రహంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టంచేశారు. జవాబుదారీతనం కోసం అడుగుతున్నారని, మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకే బయటకు వచ్చారని తేల్చిచెప్పారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ఆరాటపడటం లేదని, విద్యార్థులపై జరుగుతున్న దారుణాలను చూడలేకే నిరసనకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమపార్టీగా వారికి అండగా నిలబడుతున్నామని చెప్పారు. పార్టీల జెండాలు, ఎజెండాలతో యువతరం ఉద్యమాన్ని కలుషితం చేయవద్దని భావించే ఢిల్లీకి వెళ్లి పోరాడటం లేదని ఉద్ఘాటించారు. దేశంలోని ఆడబిడ్డలపై పోలీసులు తీవ్రంగా దాడిచేస్తుంటే, కొట్టకూడని చోట కొడుతుంటే రాజకీయాలతో సంబంధంలేకుండా పిల్లలకు సంఘీభావం ప్రకటించామని స్పష్టంచేశారు.
దేశాన్ని కదిలించిన యువత
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు ఉపక్రమించారని కేటీఆర్ గుర్తుచేశారు. 25 రోజులుగా ఆయన పోరాటాన్ని చూపకుండా మెయిన్‌స్ట్రీమ్ మీడియా ముఖం చాటేసిందని విమర్శించారు. కానీ ఏ రాజకీయ పార్టీ మద్దతులేకున్నా, మీడియా అండ లేకున్నా జెన్‌జీ యువతరం సోషల్ మీడియా దన్నుతో దేశం మొత్తా న్ని కదిలించిందని చెప్పారు. అసలు పని చేయకుండా మతం పేరుతో తప్పించుకుంటున్న తీ రుని యువత అర్థం చేసుకుంటున్నదని వ్యా ఖ్యానించారు. ‘అంధ భక్తులారా ఇక మీ పని అయిపోయింది..ఈ తరం మేల్కొన్నది..జెన్‌జీ మీద మీరు గెలువలేరు’ అని హెచ్చరించారు.
మోదీ మీద కొట్లాడుతుంటే చోటా భాయ్‌కి ఏమైంది?
దేశ యువతకు మద్దతునిస్తూ మోదీపై బీఆర్ఎస్ కొట్లాడుతుంటే కాంగ్రెస్సోళ్లు అడ్డం పడటం విడ్డూరంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘నేను ఢిల్లీలోని మోదీని తిడుతుంటే ఇక్కడ చోటాభాయ్కి ఏమైందో? ఏం నొప్పి వచ్చిందో అర్థంకావడం లేదు.. నీకేమొచ్చింది రోగం? అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు రాహుల్‌గాంధీ ధర్నాకు కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కున్నది.. కొద్దిగైనా రేషమున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ రాజ్‌భవన్ ముందైనా ధర్నా చేసిండు.. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం కొడంగల్‌కు పోయి రాహుల్‌ను అరెస్ట్ చేసిండ్రని, దెబ్బతాకిందని ధర్నా పేరిట గగ్గోలు పెట్టిండు..రేవంత్‌రెడ్డీ నీకు సోయి ఉన్నదా? నీకు బిడ్డ ఉన్నది కదా? ఆడపిల్లలను గొడ్లను బాదినట్టు బాదుతుంటే నీకు రేషం రాదా? స్పందనలేదా?’ అంటూ నిప్పులు చెరిగారు. దేశ యువత, రాహుల్‌గాంధీ కూడా ధర్మేంద్ర ప్రధాన్, ప్రధానిని రాజీనామా చేయాలని అడుగుతుంటే చోటా భాయ్ మాత్రం కేసీఆర్, కేటీఆర్ తప్పుచేశారని మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రినని మరచిపోయి నిద్రలో కూడా కేసీఆర్..కేసీఆర్ అని కలువరిస్తున్నరు’ అంటూ చురకలంటించారు. మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టిన చందంగా నీట్ పేపర్ లీకేజీని తనకు అంటగట్ట డం దుర్మార్గమని దుయ్యబట్టారు. ‘నీకు సిగ్గూశరముంటే.. మాట మీద ఉండే మనిషివే అయి తే.. ఆరోపణలకు కట్టుబడి వాస్తవాలను నిగ్గుతేల్చాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీని వణికించి తెలంగాణను సాధించిన పార్టీ మాది..అవసరమైతే మళ్లీ ఢిల్లీకి వెళ్లి విద్యార్థుల పోరాటానికి అండగా నిలబడుతం..రేవంత్‌రెడ్డీ.. నీకు ఎలాగూ ధైర్యం లేదు.. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నవో చెప్పు?’ అని నిలదీశారు.
జెన్‌జీ ఉద్యమం వస్తదని నేను చెప్తే నమ్మలేదు
జెన్‌జీ ఉద్యమం మన దేశంలో వస్తుందని మొదట తాను చెబితే నమ్మలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి నాయకుడు, నాయకత్వం, రాజకీయ ఎజెండా లేకుండానే కాక్రోచ్ల మాదిరిగా కదిలి దేశమంతటా తిరుగుబాటు మొదలైందని వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నేడు ప్రధాని నోరు తెరువాలనే వరకు వచ్చిందని చెప్పారు.
వాట్సాప్ వర్సిటీ వర్సెస్ ఇన్‌స్టా జెనరేషన్
వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు, ఇన్‌స్టా జెనరేషన్‌కు మధ్య పంచాయితీ నడుస్తున్నదని పరోక్షంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ చురకలంటించారు. ‘ఒక్క కేంద్ర మంత్రిని కాపాడేందుకు యువతపై ఉక్కుపాదం మోపడమేంది?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో జూలై 20న విద్యార్థులను ఈడ్చుకుంటూ కొట్టిన దృశ్యాలతో దేశంలోని కోట్ల మంది గుండెలు బద్దలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా విద్యార్థులను పిలిచి వారి సమస్యలను అడిగి తెలుసుకొని విద్యారంగంలో కొత్త సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్లో చర్చించాలని కోరా రు. ఢిల్లీలో ఆందోళనల్లో పాల్గొన యువతకు సంఘీభావంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వేల మంది విద్యార్థులు తరలి వచ్చారని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఇక్కడి యువత సైతం ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
యువత పోరాటానికి మద్దతిస్తాం
విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్రమ కేసులు పెట్టిన పోలీసులపైనా కేసులు పెట్టాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులు చేపట్టిన ఈ పోరాటం ఒక నిరసన లేదా ధర్నా తో అయిపోకూడదని, న్యాయం జరిగే వరకు కొనసాగాలని కాంక్షించారు. కేంద్రం మెడలు వంచే వరకు యువత సాగించే పోరాటంలో తాను సైతం కలిసివస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు, సీనియర్ నాయకులు యువత పోరాటానికి అండగా ఉంటామని స్పష్టత ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం చేపట్టి నా తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
కేసీఆర్ అన్నీ గమనిస్తున్నరు
ఢిల్లీలో విద్యార్థులు పోరాడుతున్న తీరు.. వారిపట్ల కేంద్రం దాష్టీకం.. ఈ వ్యవహారాలను కేసీఆర్ గమనిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. అన్ని విషయాలూ తమతో చర్చిస్తున్నారని, అన్ని వర్గాల ఆకాంక్షలను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ గతంలోనే దేశానికి అవసరం పడ్డరోజు ప్రతి ఒకరూ స్పందిస్తారని..‘ఇండియా రియాక్ట్స్’ అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థులు, యువతకోసం అవసరమైన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అండగా నిలుస్తారని స్పష్టంచేశారు. ‘విద్యార్థులు..యువకుల్లారా మీరు స్వతంత్రంగా కొట్లాడండి..కొన్ని పార్టీలు, కొందరు దుర్మార్గులు మీ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు, ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు యత్నిస్తున్నరు జాగ్రత్త.. స్వతంత్రంగానే, మీ ఎజెండా మేరకే ఉద్యమాన్ని కొనసాగించండి.. ఇద్దరు ఎంపీలతో ఢిల్లీ సర్కార్ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్లండి’ అని పిలుపునిచ్చారు.
కేంద్ర మంత్రుల కొడుకులకు బెయిల్లు వస్తున్నయ్
ఢిల్లీలో న్యాయం కోసం యువత పోరాడుతుంటే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు స్పందించకపోవడంలోని ఆంతర్యమేందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘లైంగిక దాడులకు పాల్పడ్డ కేంద్ర మంత్రుల కొడుకులకు బెయిల్లు వస్తున్నయ్.. కానీ పేపర్ లీకేజీపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రావడంలేదెందుకు?’ అని యువత అడుగుతున్నది. ఏ దేశం కోసం? ఏ ధర్మం కోసం పేపర్ లీకేజీలపై సమాధానం చెప్పడం లేదు? ఇప్పటికైనా బీజేపీ నాయకులు మౌనం వీడి యువత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే వారి కోపాగ్నిలో దహించిపోతరు’ అని హెచ్చరించారు. మీడియాను అడ్డంపెట్టుకొని ఎజెండా సెట్‌చేసే, వ్యక్తిత్వ హననం చేసే రాజకీయం నడువదని..పిల్లల వద్ద బలమైన అస్త్రాలు ఉన్నాయని..భవిష్యత్తు దేశ నిర్మాతలు మేల్కొన్నారని తేల్చిచెప్పారు.
విద్యార్థులు చేపట్టిన ఈ పోరాటం
ఒక నిరసన లేదా ధర్నాతో అయిపోకూడదు. న్యాయం జరిగే వరకూ కొనసాగాలి. కేంద్రం మెడలు వంచే వరకు యువత సాగించే పోరాటంలో నేను సైతం కలిసివస్తా. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులమంతా యువత పోరాటానికి అండగా ఉంటాం. 119 నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా మా మద్దతు ఉంటుంది.
-కేటీఆర్
మెయిన్‌స్ట్రీమ్ మీడియా అండ లేకున్నా జెన్‌జీ యువతరం సోషల్ మీడియా దన్నుతో దేశం మొత్తాన్ని కదిలించింది. ఇదే తెలంగాణ గడ్డ నుంచి 50 ఏండ్ల కిందట ‘జీనా హైతో మర్నా సీకో..కదం కదం పర్ లడ్నా సీకో’ అని పిలుపునిచ్చిన ఓ యువకుడి స్ఫూర్తితో తెలంగాణ, దేశ యువత గట్టిగా కొట్లాడుతున్నది. వారు గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది.-కేటీఆర్
దేశంలోని ఆడబిడ్డలపై పోలీసులు తీవ్రంగా దాడి చేస్తుంటే, కొట్టకూడని చోట కొడుతుంటే రాజకీయాలతో సంబంధంలేకుండా పిల్లలకు సంఘీభావం ప్రకటించినం. మోదీ జీ..వారేమైనా మీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి కుర్చీ అడిగిండ్రా? వాళ్లకు న్యాయం చేయాలని, భవిష్యత్తును కాపాడాలని నిరసన తెలుపుతున్నరు.. విశ్వగురువు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీస్తున్నరు.. ‘ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపిన మహానేత మా కన్నీళ్లు తుడువలేరా?’ అని అడుగుతున్నరు. కానీ మీరు మాత్రం వారి ఆవేదనను విస్మరించి దుర్మార్గాలకు దిగుతున్నరు. -కేటీఆర్
ప్రజాస్వామ్యం చనిపోయింది
దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిం ది. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు, బంధువులకు పోక్సో కేసులో బె యిల్ వచ్చినంత త్వరగా.. విద్యార్థుల కు సమాధానం దొరకడం లేదు. విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దు. యువత విషయంలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. -ఆకర్షిత, జెన్‌జీ కార్యకర్త
జెన్‌జీ తడాఖా చూపిస్తాం
పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే ఢిల్లీ వీధుల్లో విద్యార్థులను దారుణంగా కొట్టారు. కార్పొరేట్ కాలేజీల్లో ఎంతో మంది విద్యార్థులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుతున్నారు. ఇప్పుడు వారందరికీ ఈ పేపర్ లీకేజీ వల్ల అన్యాయం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. బాధిత కు టుంబాలకు న్యాయం చేయాలి. -ఆదిత్య, నీట్ విద్యార్థి
న్యాయం జరిగే వరకూ పోరాటం
యువత, విద్యార్థులకు జరిగిన అ న్యాయంపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు. నీట్లో జరిగిన పొరపాట్లతో విద్యార్థులకు అన్యాయం జరిగింది. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చే యాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వ రకూ మా పోరాటం కొనసాగుతుంది. -సూర్య , జెన్‌జీ కార్యకర్త.
వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు..
నేనూ ఢిల్లీలో ఆందోళనలో పాల్గొనేందుకు ట్రైన్లో వెళ్లా. జంతర్‌మంతర్‌కు వెళ్లే విద్యార్థులను అడ్డుకునేందుకు అన్ని రవాణా సౌకర్యాలను మూసివేశారు. విద్యార్థుల వద్ద ఎలాంటి రాళ్లు, కర్రలు లేవు. విద్యార్థులను దేశద్రోహులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ప్రశ్నించే హక్కును కేంద్రప్రభుత్వమే కాలరాసింది. కేంద్ర మంత్రి రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు. -జాన్వీ, నీట్ అభ్యర్థిని
దేశంలో విద్యావ్యవస్థ వైఫల్యం
ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎం తో కష్టం. నీట్ పేపర్ లీకేజీ వ్యవస్థ వైఫ ల్యం. జంతర్‌మంతర్‌లో పిల్లలను పోలీసులు కొట్టడం బాధాకరం. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై అణచివేత తగదు. ఇది ప్రధాని మోదీ, బీజేపీ కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన కాదు. భవిష్యత్తు కోసం తిరుగుబాటు. -పవన్, ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి
ఆందోళనను విరమించం
విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు వద్దు. వారికి న్యాయం జరగాలి. దేశ ప్రజలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రోజుల తరబడి కష్టపడి పరీక్షలు రాస్తే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. సమస్య పరిష్కరించేంతవరకు ఈ ఆందోళనలను విరమించం. ఐక్యపోరాటాలు కొనసాగిస్తాం. యువత, రైతుల ఆందోళనలు హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. -శ్రేయ, నీట్ అభ్యర్థి
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలు
నీట్ లీకేజీపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. అన్యాయంపై పోరాటం చేస్తున్న విద్యార్థులను దేశద్రోహులు, టెర్రరిస్టులని ముద్ర వేయడం అన్యాయం. పేపర్ లీకేజీల వల్ల లక్షలాదిమంది విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే ప్రధాని మోదీ, ధర్మేంద్రప్రధాన్ విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. ఢిల్లీలో విద్యార్థులను పోలీసులు దారుణం గా కొట్టారు. జరిగిన తప్పును ప్ర శ్నించేవారిపై ప్రభుత్వం ఇలా దాడికి దిగడం సరికాదు. వెంటనే బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. -ప్రణతి, విద్యార్థిని

ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి, బాల్క సుమన్, సునీతాలక్ష్మారెడ్డి, భూపాల్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గాదరి కిశోర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు