హైదరాబాద్, ఆగస్టు 29: పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, డీఏల సాధనతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సెప్టెంబర్ నెలలో పలు ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGCPSEU) నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీలోని భాగస్వామ్య సంఘాలతో హైదరాబాద్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1ను సీపీఎస్ విద్రోహ దినంగా పాటించాలని జేఏసీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.

సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధనకై సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశంలో SGTU అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, TGCPSEU అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్, డిపార్ట్మెంటల్లీ డిఫరెంట్లీ బుల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హబీబుద్దీన్, బాలస్వామి, జగదీష్ రెడ్డి, మూర్తి తదితర TGEJAC భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.