– కొత్తగూడెం జిల్లాకు సీతారామ జలాలు అందించాలి
– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య డిమాండ్
జూలూరుపాడు, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు జలాలను స్థానిక మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే ముందుగా అందించాలని, మంత్రుల జల దోపిడీని తక్షణమే అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి నరసయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులను సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ జిల్లా రైతులు వేలాది ఎకరాల భూములను త్యాగం చేస్తే, వారికి చుక్క నీరు అందించకుండా ఇతర ప్రాంతాలకు జలాలను తరలించడం దారుణమన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు తమ అధికార బలంతో జలదోపిడీకి పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
జిల్లాలో చివరి ప్రాంతమైన జూలూరుపాడు నుంచి ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తూ, స్థానిక రైతాంగాన్ని విస్మరించడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో రూపొందించిన డిజైన్ ప్రకారం రోళ్లపాడు చెరువును నింపడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు అతి తక్కువ ఖర్చుతో సాగునీరు అందించే అవకాశం ఉండేదన్నారు. కానీ, భూములు కోల్పోయి నష్టపోయిన ప్రాంతాలకు కాకుండా, ఇప్పటికే రెండు పంటలు పండుతున్న ప్రాంతాలకు నీరు తరలించేందుకు మంత్రులు యుద్ధప్రాతిపదికన కాల్వలు తవ్వించడం వారి కుటిల బుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లాలోని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగునీరు అందించేలా సీతారామ ప్రాజెక్టు పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని దండాల్ చెరువు, చెనగ చెరువు, కప్పలకుంట తదితర చెరువులను నింపేందుకు వెంటనే పంట కాలువలు తవ్వాలన్నారు. తద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం ప్రాజెక్టుకు సైతం నీరు చేరి వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు.
ఇప్పటికైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు స్పందించి, ప్రాజెక్టు నిధుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, జిల్లా రైతాంగానికి న్యాయం జరిగేలా పనులు త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, అమర్లపూడి రాము, జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, బానోత్ ధర్మ, ఎస్.కే. యాకుబ్ షావలి, కల్లూరి కిషోర్, బుర్ర వెంకన్న, మండల నాయకులు లింగాల వీరభద్రం, తోటకూరి నరేష్, బైరు వెంకన్న, రాయల సిద్దు పాల్గొన్నారు.