– పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ డిమాండ్
భువనగిరి అర్బన్, జూలై 10 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో అన్ని విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదన్నారు. యూనిఫాంలు ఏ ఒక్క విద్యార్థికి అందించలేదన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారిందన్నారు. అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నావంటి సంస్థల ద్వారా అందిస్తున్న భోజనం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గత 45 సంవత్సరాల క్రితం కట్టిన భవనాలు శిథిల వ్యవస్థకు చేరినాయని వర్షాకాలం వాన కురిస్తే పూర్తిగా కూలి విద్యార్థుల మీద పడి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవనాలు నిర్మించాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని, ఒక పాఠశాలలో 30 మందికి ఒకటే టీచర్ ను కేటాయించడం సరికాదని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని. పుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్టులు, టైలు, షూలు, సాక్సులు తదితర వస్తువులను విద్యార్థులపై బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని అన్నారు. పాఠశాలలకు ఆకర్షణీయమైన పేర్లు జోడించి ప్రచారం చేస్తూ నర్సరీ స్థాయి నుంచే లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించే ప్రతిపాదన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తు మరో పక్క ప్రైవేట్ విద్యా సంస్థలను ఓపెన్ చేస్తున్నారని, పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఉన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, హిందురాణి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మారుపాక లోకేష్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చింతల శివ, కమిటీ సభ్యులు నేహాల్, సన్నీ, భాను ప్రసాద్, జిల్లా నాయకులు ఎల్.జగదీష్, మున్నా, నవీన్, గాంధీ పాల్గొన్నారు.