భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 18 : ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానాకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుండి క్యూలో ఉండి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు యూరియా కొరత లేదని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల అవస్థలు వర్ణణాతీతంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన మరింత పెరిగింది. యూరియా బుకింగ్ కోసం సెల్ పట్టుకుని యాప్ ఓపెన్ చేయగానే క్షణాల్లో స్టాక్ జీరో కనిపిస్తుంది. చదువు రానివారు, సెల్ ఫోన్ పై అవగాహన లేని వారు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా ఇస్తున్నారని సమాచారం తెలుసుకుని రైతులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. యాప్ లో బుక్ చేసుకున్న వారు యూరియా కోసం బారులు తీరారు. మరికొంతమందికి రైతులకు యూరియా అందక ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లారు. బుధవారం 444 బస్తాలు రాగా యాప్లో బుక్ చేసుకున్న రైతులకు యూరియాను పంపిణీ చేశారు.