భూదాన్ పోచంపల్లి, మే 26 : ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రహదారిపై వడ్ల బస్తాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద పక్క మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారని, పోచంపల్లి మండలానికి సంబంధించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్ద దిగుమతి చేసుకోక రోజుల తరబడి జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యం లారీల లోడింగ్, అన్లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నారని, వర్షాలు పడే అవకాశం ఉండడంతో ధాన్యం తడిస్తే రైతు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తరుగు పేరిట మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, ధాన్యం కొనుగులు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 30 నిమిషాలు ధర్నా కార్యక్రమం చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. మండల తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి.మండల అధ్యక్షుడు మీసాల సైదులు, సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, నాయకులు మంచాల మధు, వడ్డేపల్లి యాదగిరి, లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.

భూదాన్ పోచంపల్లిలో రైతుల ధర్నా