– ధాన్యం కొనాలి.. అవకతవకలను నివారించాలి
– అధికార పార్టీ నేతలకు ప్రత్యేక నిబంధనలా?
– మేచర్ చెక్ లేకుండానే ధాన్యం తరలింపుపై నిరసన
– రైతులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం
బీబీనగర్, మే 16 : రైతుల ధాన్యం కొనాలని, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు ఆపాలని, అధికార పార్టీ నేతలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ప్రత్యేక సడలింపులు ఇస్తూ సాధారణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో జరగుతున్న అవకతవకలు గుర్తించి సరిదిద్దాల్సిన అధికార పార్టీ నేతలు తన ధాన్యాన్ని పట్టకుండా మేచర్ చెక్ చేయకుండా మిల్లుకు తరలించేస్తున్నారని అందరికి ఒకలా న్యాయం జరగాలని నిలదీసిన రైతులపై దుర్బాషలాడుతూ దాడికి యత్నించాలని ఆరోపించారు. రైతులందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. అధికార పార్టీ నేతలకు ఒకలా.. సామాన్య రైతులకు మరోలా నిబంధనలు ఉండకూడదు” అంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ధాన్యం పట్టకుండా, మేచర్ చెక్ చేయకుండా మిల్లుకు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించగా రైతులపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమిరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరిలాగే ధాన్యాన్ని పట్టించి తనిఖీలు చేసి కొనుగోలు చేయాలని అడిగితే తమ మీదికి దూసుకొచ్చినట్లు తెలిపారు. ఒక సర్పంచ్ అయిన తనపైనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని మేచర్ చెక్ చేసి ఏ గ్రేడ్ గా పాస్ చేసి కాంటా వేస్తున్నారో, అదే ధాన్యం మిల్లుకు వెళ్లేసరికి బి గ్రేడ్ గా మారుతోందని ఆరోపించారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కొనుగోలు కేంద్రంలో ప్రతి బస్తాకు 2 కిలోల పైగా కటింగ్ చేసి మిల్లులకు తరలించాక అక్కడ కూడా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా సుమారు నాలుగు, ఐదు రోజులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మలగారి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. సెంటర్ ఇన్చార్జి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, మండల పార్టీ మాజీ అద్యక్షుడు పిట్టల అశోక్, మండల ఉపాద్యక్షుడు గూదె శ్రీశైలం, నాయకులు సోము రమేష్, వడకాల శివగౌడ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.