యాదగిరిగుట్ట, మే 28 : రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతులకు అందజేసిన రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 3వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. యాదగిరిగుట్ట మండలంలో కేవలం ఎమ్మెల్యే స్వగ్రామం సైదాపురం గ్రామానికి మాత్రమే రైతు భరోసాను అమలు చేసి, మిగతా గ్రామాలకు అమలు చేయకుండా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అడ్డుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన స్వగ్రామంలో వంద శాతం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసి నియోజకవర్గంలోని మిగతా గ్రామాలకు ఎందుకు అమలు చేయడంలేదో ఎమ్మెల్యే చెప్పాలన్నారు.
గతేడాది వానాకాలం పంటకు పెట్టుబడి సాయం రాలేదని, ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభం కావొస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఊసేత్తడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని దొంగ హామీలిచ్చి, అధికారంలోకి రాగానే రైతులను మోసం చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యేపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వెంటనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులకు బేషరతుగా పెట్టుబడి సాయం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 3న యాదగిరిగుట్ట తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.