భూదాన్ పోచంపల్లి, జూలై 15 : ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు పూరించి పూర్తి వివరాలతో బీఎల్ఓలకు సమర్పించాలని, లేనిచో ఓటు రద్దు అవుతుందని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మరణించినా, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారినా, పెళ్లిళ్లు అయినా వ్యక్తుల వివరాలు బీఎల్ఓలకు తెలియజేయాలని సూచించారు. ప్రతి అర్హులైన ఓటర్ల వివరాలను ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావు లేకుండా నమోదు చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని, బీఎల్ఓలకు అందరూ సహకరించాలని కోరారు.