బీబీనగర్, ఏప్రిల్ 08 : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాతా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5, 6, రామునిగుండ్ల తండాలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. తల్లులు, పిల్లలకు సరఫరా చేస్తున్న పోషకాహార పదార్థాల నిల్వలను తనిఖీ చేసి, నాణ్యతను పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులు టాయిలెట్స్, త్రాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించి తెలుసుకున్నారు.
చిన్నారులకు అందిస్తున్న సేవలు, హాజరు వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శృతి ఓజా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు సంఖ్యను మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి చిన్నారికి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, సేవలు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి (డీడబ్ల్యూఓ) నరసింహారావు, సీడీపీఓ శైలజ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదును పెంచాలి : శృతి ఓజా