హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. ముఖ్యంగా వచ్చే 15 ఏండ్లలో విద్యుత్తు వినియోగం రెట్టింపు అవుతుందని, గరిష్ఠ డిమాండ్ ఏకంగా 47 వేల మెగావాట్లు దాటుతుందని పేర్కొన్నది. దక్షిణాదిలో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే అత్యధిక పీక్ డిమాండ్ నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆధారంగా సీఈఏ ఈ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో గ్రిడ్ విస్తరణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 24 వేల మెగావాట్లకు సరిపడా గ్రిడ్ మాత్రమే ఉన్నది. మున్ముందు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని, ట్రాన్స్మిషన్ కారిడార్లు, సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, నిల్వవ్యవస్థ (బ్యాటరీ స్టోరేజీ)లను బలోపేతం చేయాలని, రెన్యువబుల్ ఎనర్జీ సేకరణపై కూడా దృష్టి సారించాలని సీఈఏ సూచించింది. వాస్తవానికి గత రెండేండ్ల కాలంలో గ్రిడ్ విస్తరణకు ట్రాన్స్కో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొత్త సబ్స్టేషన్లు నిర్మించలేదు. ఇది భారీ ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందని విద్యుత్తురంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యవసాయం, గృహ విద్యుత్తు కనెక్షన్లు అధికమవడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలు మరింత పెరుగుతాయని, పీక్ డిమాండ్ (ఏక కాలంలో నమోదయ్యే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్) సైతం అధికమవుతుందని సీఈఏ హెచ్చరించింది. ఈ ఏడాది రాష్ట్రంలో 92 వేల మిలియన్ యూనిట్లుగా ఉన్న వార్షిక విద్యుత్తు వినియోగం 2041-42 నాటికి 1.96 లక్షల మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని, ఇదే సమయంలో గరిష్ఠ డిమాండ్ 19 వేల నుంచి 47 వేల మోగావాట్లకు చేరుతుందని పేర్కొన్నది.
సీఈఏ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ జెన్కో సారధ్యంలోని పవర్ ప్లాంట్లు సగం లోడ్తోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా జల విద్యుత్తు కేంద్రాల పరిస్థితి మరీ పేలవంగా ఉన్నది. శ్రీశైలంలో నీళ్లున్నా విద్యుత్తు ఉత్పత్తి అంతంత మాత్రంగానే చేస్తున్నారు. మన ప్లాంట్లను సక్రమంగా నడపకుండా బయటి నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపిపేందుకు గతంలో కేసీఆర్ సర్కార్ కొత్త థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోపాటు జల విద్యుత్తు కేంద్రాల పనుల్లోనూ వేగం పెంచింది. కానీ ఆ ప్లాంట్లను సక్రమంగా నడుపడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. దీంతో వైటీపీఎస్ యూనిట్-4 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 28.63 శాతానికే పరిమితమైంది. యూనిట్-2 పీఎల్ఎఫ్ 43.44 శాతంగా, భద్రాద్రి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 68.66 శాతంగా ఉన్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి ఆశాజనంగా లేదు. ఆదివారం జెన్కో వాటా 113.17 మిలియన్ యూనిట్లు మాత్రమే. థర్మల్ విద్యుత్తు వాటా 101 మిలియన్ యూనిట్లుగా, హైడల్ విద్యుత్తు వాటా కేవలం 11.54 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. గత 2 నెలలుగా జెన్కో ఉత్పత్తి చేసిన విద్యుత్తు 110 మిలియన్ యూనిట్లలోపే ఉండగా.. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 233 నుంచి 307 మిలియన్ యూనిట్ల వరకు ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు రోజూ సగటున 90-100 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు.
