బీబీనగర్, జూలై 26 : బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎలక్ట్రిక్ వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకున్నట్టు తెలిపారు. వాహనాల ద్వారా ఆస్పత్రి భవనం, ఆయుష్, అకాడమిక్ భవనాల మధ్య సేవలందించనున్నట్టు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు, రోగులు, వైద్య సామగ్రి తరలింపు సౌకర్యం కోసం, భవనాల మధ్య రవాణాకు వాహనాలు ఉపయోగపడతాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాన్ని అందిస్తాయన్నారు. శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా ఆస్పత్రి ఆవరణలో వాతావరణాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రాహుల్ నారంగ్, డిప్యూటీ డైరెక్టర్ బీపీ వర్గీస్, డాక్టర్ ప్రశాంత్ పాల్గొన్నారు.