భూదాన్ పోచంపల్లి, నవంబర్ 28 : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం అని, అలాంటి ఎన్నిక చెల్లదని, రుజువైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై వేటు పడుతుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వేలం ద్వారా సర్పంచ్, వార్డు మెంబర్ పదవులు దక్కించుకోవాలనే నిర్ణయం తప్పు అని, ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ఆలేరు, బొమ్మలరామారం, బీబీనగర్, ఆలేరు, పంతంగి నాలుగు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
చెక్ పోస్ట్ ల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపాలని, ఎక్కడా కూడా ఖాళీ వదిలి వేయవద్దన్నారు. అవసరమైతే హెల్ప్ లైన్ డెస్క్ అధికారులు, సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి ఖర్చు చేస్తే వారిని ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ రెడ్డి, అధికారులు అపర్ణ, శిక్షకులు పాల్గొన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల (పిఓ) ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 17 మండలాల్లో 3,704 వార్డులకు, 427 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 153 సర్పంచులు, 1,286 వార్డు మెంబర్లకు, 41 క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు సైతం పూర్తైనట్లు తెలిపారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

Bhoodan Pochampally : వేలం వేస్తే ఎన్నిక చెల్లదు : కలెక్టర్ హనుమంతరావు