రామన్నపేట, నవంబర్ 06 : విద్యుత్ షాక్తో వ్యక్తి, బర్రె మృతి చెందిన సంఘటన రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గొర్ల మల్లయ్య (75) రోజు మాదిరిగానే బుధవారం తన బర్రెలను మేపడానికి గ్రామ శివారులోని పొలాల వద్దకు వెళ్లాడు. బర్రె బురద పొలంలోకి వెళ్లడంతో దాన్ని తొలుక రావడానికి మల్లయ్య వెళ్లాడు. అప్పటికే అక్కడ విద్యుత్ సర్వీస్ వైర్ పడి ఉండడంతో మల్లయ్య, బర్రె విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికిన జాడ దొరకలేదు. గురువారం ఉదయం తెల్లవారుజామున బావుల వద్దకు వెళ్తున్న రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య సాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.