సిద్దిపేట, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు భరోసా కోసం రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే వేస్తాం .. సంక్రాంతి పండుగకు వేస్తాం.. మున్సిపల్ ఎన్నికలు కాగానే వేస్తాం ..ఇలా దాటవేసే ధోరణిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఆశగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లుతున్నది.
కాంగ్రెస్ సర్కార్ మాటలతో విసిగి వేసారిన రైతులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలని ఇప్పటికే సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. త్వరలోనే రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది.
రైతు భరోసా ఊసే ఎత్తడం లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై చర్చించలేదు. దీనిని బట్టి రైతులకు రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుందని రైతులు మండిపడుతున్నారు.సిద్దిపేట జిల్లాలో 5,63, 005 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 3.61. 078 మంది రైతులు ఉన్నారు. మెదక్ జిల్లాలో 3,20,514 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 2,80, 949 మంది రైతులు, సంగారెడ్డి జిల్లాలో 7, 48,000 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 3,62, 143 మంది రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, సోయా, కూరగాయ తదితర పంటలు ఎక్కువగా సాగుచేస్తారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు భరోసా లేకుండా పోయింది. పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అసలు వడ్డీలు కలిపి వచ్చిన పంటంతా వ్యాపారులకే పోతు న్నది. దీంతో రైతులకు ఏంమిగలడం లేదు. కరెంట్ కష్టాలతో తరుచూ మోటర్లు కాలడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కష్టాల కడలిలో రైతులు సాగు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు హ్యాపీగా సాగు పనులు చేసుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ సర్కా రు దన్నుగా నిలిచింది. రైతులు అడగకముం దే11 విడతల్లో సిద్దిపేట, మెదక, సంగారెడ్డి జిల్లాలో కలి పి మొత్తం రూ. 8,771 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది.ప్రతి పంట సాగుకు ఏడాదిలో రెండు పంటలకు రైతు బంధు అందించి రైతుల్లో భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి పొంతన లేని మాటలు మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక రైతులకు ఎగనామం పెట్టుడు కాంగ్రెస్ సర్కార్ పని అని కర్షకులు మండి పడుతున్నారు.
రైతు భరోసా నిధుల విడుదల కోసం అన్ని రైతు సంఘాలు, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉద్యమించనున్నారు. ఎలాంటి షరతులు లేకుండాప్రభుత్వం రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా వేసే దాకా తమ పోరాటం ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి రైతు భరోసా నిధులు విడుదల చేసే దాకా పోరాటం చేయడానికి రైతులు సమాయత్తమవుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దున్నకానికి ముందే బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు పడేవి. కాంగ్రెస్ వస్తే మేము ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చివరకు రూ.12వేలు ఇస్తామన్నారు. వాళ్లు ఇస్తామన్న పైసలు ఎప్పుడూ ఎదురుచూడకుండా ఇచ్చింది లేదు. ‘పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును కొన్నట్లు అయ్యింది రైతుల పరిస్థితి’. వ్యవసాయశాఖ మంత్రి నాట్లు పూర్తయ్యే వరకు రైతుభరోసా పైసలు వేస్తామని చెప్పిండు. ముఖ్యమంత్రి ఫిబ్రవరి 17న ఇస్తామని చెప్పిండు. కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడిస్తాం..అప్పుడిస్తామని చెప్పడమే కానీ ఇచ్చింది లేదు. నాకైతే ఈ సర్కారు మీద నమ్మకం లేదు
-నిమ్మ మల్లారెడ్డి, రైతు, పోసాన్పల్లి, కొమురవెల్లి మండలం ( సిద్దిపేట జిల్లా)
నాకు మూడు ఎకరాల భూమి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రాజెక్టులు కట్టించడంతో పాటు సమయానికి పెట్టుబడి సాయం అందించాడు. దీంతో గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా భూమి సాగులోకి వచ్చింది. అప్పులు తీర్చుకొని నాలుగు వేళ్లు నోటిలోకి పోయే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మేము కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పితే నమ్మి ఓటువేశాం. ఇచ్చే పైసలు కూడా ఎప్పుడూ టైమ్‌కు ఇచ్చింది లేదు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలప్పుడు అయిపోగానే రైతుభరోసా వేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పిండు. ఆయన ఎప్పుడూ మాటమీద నిలబడడం లేదు.
-మెతుకు నర్సింహులు, రైతు, ఐనాపూర్,కొమురవెల్లి మండలం (సిద్దిపేట జిల్లా)