రామన్నపేట, నవంబర్ 08 : కార్మిక వర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామలను చూస్తే అర్ధం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. రామన్నపేట మండల కేంద్రంలో స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్లో సీఐటీయూ జిల్లా నాలుగో మహాసభలు ఉత్సహ పూరితంగా జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 300 మంది 17 మండలాల నుండి వివిధ రంగాల నుండి కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభ సూచికగా అరుణ పాతాకాన్ని జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు ఆవిష్కరించగా నాయకత్వం, ప్రతినిధులు అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఆయుధ సంపత్తితో శాసిస్తున్న అమెరికా న్యూయర్క్ నగరంలో కార్మికుల పక్షపాతి జోహ్రన్ మాందనీ విజయం, ఇటీవల శ్రీలంకలో జరిగిన ఎన్నికల్లో దిస నాయకే విజయం పెట్టుబడిదారులకు చెంపపెట్టు అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని దేశాన్ని అదాని-అంబానిలకు తాకట్టు పెట్టిందని దుయ్యబట్టారు. న్యూయార్క్, శ్రీలంక స్ఫూర్తితో కార్మిక వర్గం మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పని గంటల విధానాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికుల విషయంలో తేడా లేదన్నారు. అనంతరం జిల్లా మహాసభలో జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణకు పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గొరిగే సోములు, ఎండీ.పాషా, చిలువేరు రమా కుమారి, దోనూరి నర్సిరెడ్డి, తుర్కపల్లి సురేందర్, బొడ్డుపల్లి వెంకటేశం, సుబ్బురు సత్యనారాయణ, పైళ్ల గణపతి రెడ్డి, మాయ కృష్ణ, నకిరేకంటి రాము, ఆడిమూలం నందిశ్వర్, స్వప్న, కోట సంధ్యారాణి, బందెల భిక్షం, అప్పం సురేందర్ పాల్గొన్నారు.