భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డును గురువారం వారు ఆవిష్కరించారు. రోడ్డు వెంట షాపుల్లో పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, విస్మరించిన బాకీ హామీలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలకు చేరవేయాలని సూచించారు. తాము ప్రభుత్వాన్ని చేపడితే ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడం లేదని విమర్శించారు.
ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అది ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో 22 నెలలుగా ఒక్కో మహిళకు రూ.55,000 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత పింఛన్దారులకు ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ అమలు చేయక రూ.44,000 బాకీ ఉందన్నారు. ప్రతి ఎకరాకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకు నాలుగు పంటలకు కలిపి రూ.50 వేల రైతులకు బాకీ, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యా భరోసా కింద రూ.5 లక్షలు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 చొప్పున రెండేళ్లకు రూ.24,000, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.8 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారం ఇవ్వాల్సిన బాకీలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్యాట చంద్రశేఖర్, నాయకులు బండారపు లక్ష్మణ్ గౌడ్, రంగ విశ్వనాథం, అందేల హరీశ్, బత్తుల శ్రీశైలం గౌడ్, కొంతం ఈశ్వరయ్య, గుడిసె మధుసూదన్, ముద్దగోని సతీశ్ గౌడ్, గూడూరు భవాని చంద్రశేఖర్, మల్లేశ్, నూనె ముంతల భాస్కర్, కంచర్ల గణేశ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి