రాజాపేట, డిసెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భారతదేశంలోనే అక్షయపాత్ర పోషించిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులను అరిగోస పెడుతుండడంతో ఎంతోమంది రైతులు ఆత్మబలి దానాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్ల పాలనలో ఇప్పటికీ 1,200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కేసీఆర్ అందించిన జన రంజక పాలనతో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించిందని, అలాంటి తెలంగాణను నేటి చేతకాని పాలకులతో అభివృద్ధిలో ఆమడ దూరంలో నిలిచిందన్నారు.
రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల బంగారు తెలంగాణ కల కలగానే మిగిలిపోయే రోజులు దాపురించాయన్నారు. నాటి సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎలాంటి వివక్షకు గురైందో, నేడు రేవంత్ సర్కార్ లో సైతం అలాగే వివక్షకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రణాళికయుతంగా ముందడుగు వేశారని, నిరంతరం రైతు శ్రేయస్సు కోసం పరితపించిన రైతు బాంధవుడని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే మొదటగా రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా, యాసంగిలో వరి నాట్లు పూర్తవుతున్న దశలోనూ రైతు భరోసా అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజాపేటకు సాగు నిరంధించేందుకు మంజూరైన డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులను వెంటనే చేపట్టాలని, అదేవిధంగా కాల్వపల్లి బ్రిడ్జి నిర్మాణం సైతం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గెలిచిన ఆరు నెలల్లోపు రాజాపేటకు సాగునీరు అందిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు తట్టెడు మట్టి తీసిన దాఖలాలు లేవన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుని, రాజాపేట మండలాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. ఎలాంటి అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు ఎర్రగుకుల జశ్వంత్, బెడద వీరేశం, రెడ్డబోయిన రాజు, రాణి, దేవి, సర్పంచులు పాల్గొన్నారు.