రాజాపేట, సెప్టెంబర్ 16 : పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ పాడి రైతులు మంగళవారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల పాల బిల్లు చెల్లించడం లేదని, దాంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడంతో మదర్ డైరీపై పాడి రైతులు విశ్వాసం కోల్పోయి, ప్రైవేట్ డైరీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాల శీతలీకరణ కేంద్ర మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.