– ఎన్నారం గ్రామంలో విషాదం
రామన్నపేట, జనవరి 21 : తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రామన్నపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నారం గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో వివాహానికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరన్న భయంతో తీవ్ర మనస్తాపానికి లోనై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన యువకుడు అక్కెనపల్లికి వెళ్లిన అనంతరం అక్కడే ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి అంత్యక్రియలను మంగళవారం రోజే నిర్వహించగా, యువకుడి అంత్యక్రియలను బుధవారం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.