రాజాపేట, జూన్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి విమర్శించారు. మంగళవారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని, సాగు ఖర్చులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం భస్మాసుర హస్తంలా మారిందని, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు, పంటల మద్దతు ధరలు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం రైతుల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.