ఆత్మకూరు(ఎం), జూలై 15 : సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగించిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చి గుర్తింపు పొందిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్న బాష తీరుతో ప్రజలు విసుగు చెందుతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి బజారు బాష మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన సాగిస్తే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి పార్టీని కాపాడే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని పేర్కొన్నారు.