యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. అధికారంలో ఉండటంతో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నది. ఓటైర్లెన పాల సంఘం చైర్మన్లకు తాయిలాలతో ఎర వేస్తున్నది. ఒక్కో ఓటరుకు రూ. 25వేలు ఆఫర్ చేసింది. ఇప్పటికే ఓటర్లను క్యాంప్‌లకు తరలించి దావత్‌లతో ముంచెత్తుతున్నది.
మదర్ డెయిరీ ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో కాక రేపుతున్నాయి. ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆరు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉమ్మడి నల్లగొండలో నాలుగు, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తంగా 297 మంది పాల సొసైటీ చైర్మన్లుగా ఓటర్లు ఉన్నారు. వీరందరు కలిసి ఆరుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆయా అభ్యర్థుల సీరియల్ నంబర్లు కేటాయించారు. ఈ నెల 13న హయత్ నగర్‌లోని మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల ఎన్నిక నిర్వహించనున్నారు.
పరువు పోతుందని ఆఫర్..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని, లేకుంటే పరువు పోతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆలేరు నియోజకర్గంలో అత్యధికంగా ఓటర్లున్న బీర్ల ఐలయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక్కో ఓటరుకు రూ. 25వేలు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అది కూడా ఎన్నికకు కొంత సమయం ముందే ఇచ్చేట్లు సంప్రదింపులు జరిపిపనట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం క్యాంప్‌లో 150 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
గులాబీ పార్టీ పకడ్బందీ వ్యూహాలు..
అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నది. ఎన్నికను సీరియస్‌గా తీసుకొని పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నది. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముందుండి అన్నీ తానై చూసుకుంటున్నారు. తమ ఓటర్లను కాపాడుకుంటూనే.. అవతలి ఓటర్ల మద్దతు కూడగట్టేలా చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ తరఫున యాదాద్రి జిల్లా నుంచి సందిల భాస్కర్, మారెడ్డి కొండల్ రెడ్డి, ఒగ్గు భిక్షపతి, డి.సోమిరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నలుగురు కచ్చితంగా గెలుస్తారని గులాబీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.