– పట్టించుకోని అధికారులు
యాదగిరిగుట్ట, ఆగస్టు 05 : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అధికారులకు బదులు కాంగ్రెస్ పార్టీ నేతలే అధికారులుగా మారి పంపిణీ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ తీరును ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డులను ఆయనే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా అందజేస్తున్నారు. ప్రభుత్వం అందజేసే ఏ పథకమైన ఆ శాఖలకు సంబంధించిన అధికారులే లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డుల వ్యవహారంలో మండల తాసీల్దార్ అధికారి నుంచి రేషన్ డీలర్లకు ద్వారా అందజేయాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డులను పంచాయితీ కార్యదర్శులు పంపిణీ చేయాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. కానీ పంచాయతీ అధికారులతో సంబంధం లేకుండా ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డు అందజేస్తున్నాడు. స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌గా మలిచేందుకు రేషన్ కార్డు ప్రచారానికి తీశారన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి వెంటనే రేషన్ కార్డు పంపిన ప్రక్రియను అధికారుల చేతుల మీదుగా చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం డిమాండ్ చేస్తున్నది.
ప్రజల డబ్బులతో ప్రభుత్వం చేతుల మీదుగా మంజూరు అవుతున్న పథకాలను కేవలం అధికారులే పంపిణీ చేయాలి. దీంట్లో ఏ పార్టీకి చెందిన నాయకులకు భాగస్వామ్యం ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ తీరుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నది. ఈ విషయంపై త్వరలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.