బీబీనగర్, ఆగస్టు 12 : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పిట్టల అశోక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ బీబీనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీల సత్తా చూపుతామని ఆయన హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అమృతం కుమార్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరుప్పల పృథ్వీరాజ్, బోయిన కృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, ఎర్రోళ్ల బాలరాజ్ పాల్గొన్నారు.