సంస్థాన్ నారాయణపురం, మార్చి 28 : కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తానని బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నట్లు దుయ్యబట్టారు.
పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుజ్జ గ్రామంలో దరఖాస్తులు స్వీకరించగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించినట్లు తెలిపారు. దరఖాస్తులను ప్రజల తరపున తాసీల్దార్, జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షం, నాయకులు కుకుడాల మహేందర్ రెడ్డి, ఎలిజాల శీను, భాస్కర నరసింహ, వంగరి రఘు, నందగిరి జగత్, కుమార్, సంపతి సుధాకర్ రెడ్డి, భూసా శీను, గూడూరు మంజునాథ్ రెడ్డి, బద్దం యాదయ్యగౌడ్, కట్కూరి శ్రీకాంత్ గౌడ్, ఓర్సు విజయ్ పాల్గొన్నారు.