హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పదో తరగతి వార్షిక పరీక్షలు అడ్డంకిగా మారనున్నాయా..? ఈ పరీక్షల షెడ్యూల్‌తో ఎన్నికలకు ఇబ్బందులు తప్పవా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అటు పరీక్షలుండటం.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జనపడుతున్నట్టు సమాచారం. పరీక్షలా..? ఎన్నికలా..? అన్నది తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది.
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లలో మునిగితేలినట్టు సమాచారం. షెడ్యూల్ విడుదలకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. ఈవీఎంలను సమకూర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అధికారులు అభ్యర్థించారు కూడా.
ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది పది పరీక్షలు నెల రోజులపాటు జరుగనున్నాయి. గతంలో 10రోజుల్లోపే ముగియగా, ఈ సారి ఏకంగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. సీబీఎస్ఈలో ఒక్కో పరీక్షకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి ఉండటంతో దాన్ని ప్రామాణికంగా తీసుకుని షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పుడిదే షెడ్యూల్‌తో ఇబ్బందులొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ షెడ్యూల్ అశాస్త్రీయంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. టీచర్ ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మల్క కొమురయ్య సైతం షెడ్యూల్ మార్చాలని కోరారు. విద్యార్థి సంఘాలు సైతం అసంబద్ధంగా ఉన్న ఈ పరీక్షల షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేశాయి. ఒక పేపర్‌కు మరో పేపర్‌కు మధ్య నాలుగు, ఐదు రోజులు వ్యవధి ఇవ్వడంతో అనేక నష్టాలు వస్తాయని సర్కార్ దృష్టికి తీసుకెళ్లాయి. కానీ ఇందుకు సర్కార్ ససేమీరా అన్నది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నది. ఎన్నికలకు వెళితే మొత్తం ప్రక్రియ ముగిసేందుకు 15 రోజులు పట్టే అవకాశాలున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 17 వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల కోసం ఈ పరీక్షలను వాయిదావేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించడం రెండో ఆప్షన్‌గా కనిపిస్తున్నది. ఈ రెండు నెలల్లోనే పదో తరగతి పరీక్షలున్నాయి. పరీక్షలే ముఖ్యమనుకుంటే ఈ రెండు మాసాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం లేదు. అదే ఎన్నికలే ముఖ్యమనుకుంటే పదో తరగతి పరీక్షలను వాయిదా వేయడం, లేదంటే వారం, పది రోజుల్లోనే ముగించేలా కొత్త షెడ్యూల్ రూపొందించాల్సిన ఆప్షన్ తప్ప మరొకటి కనిపించడంలేదు.
నెల రోజులున్న పరీక్షలను పది రోజులకు కుదించి.. వెంట వెంటనే పరీక్షలను నిర్వహిస్తేనే ఏప్రిల్‌లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఇక పాత షెడ్యూల్ ప్రకారమే పది పరీక్షలు నిర్వహించాలనుకుంటే ఏప్రిల్ మూడో వారం తర్వాతే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఎన్నికలను వాయిదా వేయాలా.. లేక పరీక్షలను వాయిదా వేయాలా అన్న మీమాంస నెలకొన్నది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే, ఆయా షెడ్యూల్‌ను బట్టి సర్కార్‌తో సంప్రదించి పరీక్షల షెడ్యూల్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.