Prabhas | రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద సూపర్స్టార్లలో ఒకరిగా ఎదిగారు ప్రభాస్.ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, దేశవ్యాప్త విడుదలలు, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న కథలతో ఆయన రేంజ్ మరింత పెరుగుతోంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు సాధించడం ప్రభాస్ ప్రత్యేకతగా ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలు అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
చిత్ర బృందం వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించగా, గాయాలు తీవ్రంగా లేవని తెలిసింది. వైద్యులు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారని యూనిట్ తెలిపింది. ఈ వార్తతో అభిమానులు తొలుత ఆందోళన చెందగా, గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ‘ఫౌజీ’ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సీతారామంతో ప్రశంసలు అందుకున్న ఆయన, ఈసారి మరింత ఎమోషన్‌తో కూడిన యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని తెలుస్తోంది. గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని, భారీ సెట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి చిత్రం స్పిరిట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్గా త్రిప్తి దిమ్రీ నటిస్తుండగా, టి-సిరీస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించగా, ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ది రాజా సాబ్తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్‌తో పాటు సలార్ 2, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వరుస చిత్రాలతో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.