మోటకొండూరు, జూన్ 26 : పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిందన్నారు. రైతన్నలు రైతు భరోసా అందుతుందని ఆశిస్తే, చివరకు నిరాశ మిగిలిందన్నారు. ఇప్పటికైనా ఏకకాలంలో రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని, లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదని పేదలను దోచుకునే పాలన అన్నారు. రైతు భరోసా, ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
రైతులకు ఏం చేశారని సంబురాలు జరుపుకుంటున్నరని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ నాయకులకు తప్పా అర్హులైన పేదలకు అందడం లేదన్నారు. పథకాల అమలు తీరును ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని, సకాలంలో పెట్టుబడి సాయం, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, పండించిన పంటలకు మద్దతు ధర అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కన్వీనర్, మండల మాజీ అధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎగ్గడి కృష్ణ, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.