చౌటుప్పల్, ఫిబ్రవరి 04 : చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని ఆరోపిస్తూ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు తెలుపకుండా ఎలా నామినేషన్లు ఉప సంహరించుకుంటారని వారు ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకోకుంటే తాము చనిపోయినట్టేనని, తమకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరి సాయిలు బీఫామ్ పొందింది. అనుహ్య నాటకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బీఫామ్ పక్కనపెట్టి కాంగ్రెస్ తో చేతులు కలిపి కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఏకగ్రీవంగా ఎన్నికయింది. అప్పటికే కాంగ్రెస్ నుండి అభ్యర్థిగా నిలిచిన పస్తం మల్లమ్మను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు విత్ డ్రా చేయించారు. ఈ క్రమంలో వార్డు ఓటర్లు డబ్బులు తీసుకుని విత్ డ్రా చేసుకున్నావు అని ఆరోపిస్తూ ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. ఈ అవమానం భరించలేక మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లుగా సమాచారం.