వరంగల్, జులై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధాని మోదీ అంటే ఇక్కడి కేడీకి భయమని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే ఆయన కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ పేరును ప్రస్తావించడానికే సీఎం భయపడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో కుంభకోణాలపై తాము ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడానికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు. హనుమకొండ పర్యటనలో ఉన్న కేటీఆర్ గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా యువత మునుపెన్నడూ లేనంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. నీట్ అవకతవకలపై అందరికన్నా ముందు తామే స్పందించామని, సోనమ్ వాంగుచుక్కూ తామే మొదట సంఘీభావం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉండేందుకు శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన లోపాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒకసారి కూడా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
రాహుల్ ఒక మూట.. మోదీకి రెండు మూటలు
రాహుల్‌గాంధీకి ఒక మూట పంపితే, మోదీకి రెండు మూటలు పంపుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన పదవికి ప్రమాదం రాకుండా, అడ్డగోలు సంపాదనకు ఏ అడ్డంకి లేకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాన్నే పరిపాలన అని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు వాటినే రుజువు చేస్తున్నాయని స్పష్టంచేశారు.
ఎన్డీఎస్ఏ వివరణతో అడ్డంగా దొరికిన కాంగ్రెస్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది అసత్య ఆరోపణలు, అక్కసేనని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టంచేశారు. గోదావరిలో నీళ్లుండీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం లేదని, మేడిగడ్డ బరాజ్‌పై రేవంత్‌రెడ్డి అండ్ టీమ్ ఇంతకాలం చేస్తున్నవి కేవలం అసత్య ఆరోపణలేనని ఎన్డీఎస్ఏ వివరణతో తేలిపోయిందని కేటీఆర్ ఉదహరించారు. ‘బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల రీత్యా రైతులకు నీళ్లివ్వాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే’ అని ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.
మేం చెప్పేదాకా ప్రభుత్వానికి సోయిలేదు
గోదావరిలో నీళ్లున్నాయనే విషయం తాము చెప్పేదాకా రాష్ట్ర ప్రభుత్వానికి సోయిలేదని కేటీఆర్ మండిపడ్డారు. తాము కన్నెపల్లి పంప్‌హౌస్‌కు (ఈ నెల 5న) వెళ్లి గోదావరిలో నీళ్లున్నాయని, రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వానికే మనసు రావడం లేదని అసలు బండారం బయటపెట్టిన తర్వాత ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. తాము బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కండ్లు తెరిపించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. గడిచిన రెండున్నరేండ్లుగా బీఆర్ఎస్ చేసిన పోరాటాలను వివరించారు. కాళేశ్వరం విషయంలోనే కాదు.. దేవాదుల విషయంలోనూ సర్కార్ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు బయటపెట్టిన విషయాన్ని ఆయన ఉదహరించారు. ‘మాది తెలంగాణ తెచ్చిన జాతి.. నీలాగా గురువులకు భయపడేజాతి కాదు. తెలంగాణ కోసం సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన ఫైటర్ల జాతి మాది. చీటర్ల జాతి నీది. అనేక బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉనికినే లేకుండా చంద్రబాబుతో జతకలిసిన జాతి నీది. మాది తెలంగాణ బాగుకోరే జాతి.. వచ్చిన తెలంగాణను ఉండకుండా చేసేందుకు జరిగిన ద్రోహంలో బ్యాగులు మోసిన జాతి నీది.. నీలాగా మాది గురువులకు భయపడే జాతి కాదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలి వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డా జై తెలంగాణ అంటే పులకించిపోతారని, దురదృష్టవశాత్తు రేవంత్‌రెడ్డి ఇంతవరకు జై తెలంగాణ అని ఎన్నడూ అనలేదని ఆయన గుర్తుచేశారు.
సీఎం పదవి వారసత్వ హక్కు కాదు
ముఖ్యమంత్రి పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు కేటీఆర్‌పై విధంగా సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానని భావోద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యమకాలం నాటి అనుభవాలను నెమరేసుకొన్నారు. సగటు తెలంగాణ పౌరుడిగా తాను ఆశించిన దానికన్నా ఎక్కువే అయ్యానని, పదేండ్లు మంత్రిగా పనిచేశానని, తెలంగాణ తనకు సముచిత స్థానం, గౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతిమంగా పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని తెలిపారు.
బీఆర్ఎస్దే అధికారం.. కేసీఆరే సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. కష్టపడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో.. రేవంత్‌రెడ్డి వ్యవహార శైలితో ధ్వంసమైపోయిందనే అభిప్రాయానికి అన్నివర్గాల ప్రజలు వచ్చారని చెప్పారు. తమ తపన అధికారం కోసమో, పదవుల కోసమో కాదని కేసీఆర్ వంటి మహోన్నత నాయకుడి మార్గదర్శనంలోనే తాము పనిచేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన సైనికులుగా తాము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. వ్యక్తికన్నా పార్టీయే ముఖ్యమని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ‘వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యమని, కొడుకు, బిడ్డ, అల్లుడు.. ఎవరైనా సరే తాము కూర్చొన్న చెట్టుకొమ్మనే నరుక్కుంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. తాను పుట్టింది బీఆర్ఎస్లోనే, తను చావూ బీఆర్ఎస్తోనే అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికీ వందలసార్లు చెప్పినా వారిపై అనేక పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటు అని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఎవరితోనూ పొత్తులుండవు
వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ స్పష్టంచేశారు. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదని, ఇప్పుడూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, అవి రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నట్టు ఉంటాయా? లేదా కేంద్ర ప్రభుత్వం యోచనతో డీలిమిటేషన్ విధానంలో ఉంటుందా? అనేది చూడాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఏ రకంగా చూసినా నియోజకవర్గాలు పెరుగుతాయనేది ఖాయంగా తేలిపోయిందని చెప్పారు. వచ్చే సంవత్సరం తాను పాదయాత్ర చేస్తానని, ఎక్కడి నుంచి అనేది త్వరలో వెల్లడిస్తానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. దసరా తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడుతామని చెప్పారు.
చేవెళ్లలో త్వరలో దళిత సంగ్రామ సదస్సు
గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించిన చేవెళ్లలో త్వరలో తమ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంగ్రామ సదస్సు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరంగల్‌లో రైతు సంగ్రామ సదస్సు, సరూర్‌నగర్‌లో యువసంగ్రామ సదస్సు నిర్వహించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయించడమే ప్రతిపక్ష పార్టీగా తమ విధి అని స్పష్టం చేశారు. యువత, మహిళలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ అంటే రేవంత్‌రెడ్డికి భయం.
లేకుంటే కేంద్రం తీరుపై ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో కేరళ, కర్ణాటక సీఎంలు పాల్గొంటే, రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఎందుకు
నిరసన తెలిపారు? పీసీసీ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వద్ద ఆందోళన చేస్తే.. సీఎం ఎందుకు కొడంగల్‌కే పరిమితమయ్యారు.? రాజ్‌భవన్ ముందో? లేదంటే? ఢిల్లీలో ఎందుకు నిరసనలో పాల్గొనలేదు?
-కేటీఆర్
పగలు కాంగ్రెస్‌తో ఉండి, రాత్రి బీజేపీతో అంటకాగడమే రేవంత్‌రెడ్డి రాజకీయమని ఢిల్లీలో అందరికీ తెలుసు. బీజేపీ నేతలతో వారి కార్యాలయాల్లోనే రహస్య సమావేశాలు నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్, బీజేపీది రహస్య ఒప్పందం ఉన్నది. ఆ రహస్య అవగాహనతో పనిచేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్కు అర్ధరాత్రి ఒప్పందాలు, రహస్య రాజకీయాలు లేవు.
-కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఇంతకాలం ఎన్డీఎస్ఏ నివేదికను బూచిగా చూపిన ప్రభుత్వం.. ఎన్డీఎస్ఏ తాజా వివరణతో ఇప్పుడేం సమాధానం చెప్తుంది. మేడిగడ్డ బరాజ్ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో
రేవంత్‌రెడ్డి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని రాష్ట్ర రైతాంగానికి అర్థమైపోయింది.
-కేటీఆర్