న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని కేంద్రంలోని మోదీ సర్కార్ చెబుతున్న లెక్కలు మేడిపండు చందమేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసిన 7 శాతం కంటే అధికంగా వృద్ధి నమోదు చేశామంటూ బీజేపీ పెద్దలు చెబుతున్న ఆర్భాటపు ప్రకటనలు బూటకమేనా? గణాంకాలతో కేంద్ర సర్కార్ గారడీ చేసిందా? లేని అభివృద్ధిని గొప్పగా చూపేందుకు లెక్కలను తారుమారు చేసిందా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తదితర ఆర్థిక నిపుణులు కేంద్ర వృద్ధి ప్రకటనలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే సందేహం
భారత ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ యువతకు తగినన్ని ఉద్యోగాలను ఎందుకు కల్పించలేకపోతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ప్రశ్నించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై తనకు సందేహాలు ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇంత వేగవంతమైన ఆర్థిక వృద్ధి విషయంలో కొన్ని వాస్తవమైన ఆందోళనలు ఉన్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. ఈ త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే ఇది అధికం.
ఆర్థిక వ్యవస్థ నిజంగా అంత వేగంగా వృద్ధి చెందుతుంటే మరిన్ని ఉద్యోగాలు ఎందుకు లేవు, పెద్దగా పెట్టుబడులు ఎందుకు రాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ వృద్ధి గణాంకాలు నిజమైనవేనా? ఇవి నిజం కాకపోతే మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే సందేహం నెలకొంటుంది. మనం ఆందోళన చెందాల్సిన కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అవేందంటే మనం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే మరిన్ని ఉద్యోగాలను ఎందుకు సృష్టించడం లేదు? మరి పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? మన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు అంతగా వెనుకాడుతున్నారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ఎందుకు పెద్ద ఎత్తున రావడం లేదు? అని రాజన్ ప్రశ్నించారు. మనకు ఉనికి ఉన్న రంగాలలో అగ్రస్థానంలో కొనసాగడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పీఆర్‌తో జీడీపీని మెరుగుపరచలేరు: కాంగ్రెస్
జీడీపీ గణాంకాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. పీఆర్(ప్రజా సంబంధాల నిర్వహణ)తో జీడీపీకి సంబంధించిన చిత్రాన్ని మెరుగుపరచగలరేమో కానీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేరు అనే విషయాన్ని మోదీ ప్రభుత్వం గ్రహించాలని కాంగ్రెస్ బుధవారం వ్యాఖ్యానించింది. గార్గ్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ కమ్యూనికేషన్ల విభాగం ఇన్చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో గల ఏడాది జీడీపీ అంచనాలను రూ.6 లక్షల కోట్ల మేర సవరించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ సుమారు 10.3 శాతం పెరిగిందని గార్గ్ పేర్కొన్నారు.
ఒకవేళ మీరు గత ఏడాది జీడీపీ గణాంకాలను సవరించి ఉండకపోతే ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు 2.6 శాతంగా ఉండేది అని గార్గ్ ఒక వార్తా చానల్‌తో అన్నారు. తమ భజన బృందం, మీడియా ద్వారా గణాంక గారడీతో సృష్టించిన కల్పిత జీడీపీ వృద్ధి గురించి మోదీ ప్రభుత్వం ఎంత సొంత డప్పు కొట్టుకున్నప్పటికీ దాని అసలు వాస్తవ స్వరూపం బయటపడక తప్పదని రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా కూడా గార్గ్ వ్యాఖ్యలపై మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2.6 శాతానికి దగ్గరగా ఉందని వాదిస్తూ 7.8 శాతం వృద్ధి రేటు సాధించామన్న ప్రభుత్వ భారీ ప్రకటనలను సుభాష్ గార్గ్ తప్పుబట్టారు. ఆయన చేసిన మరో తీవ్రమైన ఆరోపణ ఏదంటే గత ఏడాది జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించి చూపడం వల్ల దానితో పోల్చినపుడు ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా ఉన్నట్టు కనిపిస్తున్నది అని ఖేరా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆర్థికవేత్తలమని చెప్పుకొనే నిరుద్యోగుల మాటలు నమ్మవద్దు :గోయల్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధిని మెరుగ్గా చూపించేందుకు వీలుగా జీడీపీ అంచనాలను తగ్గించి సవరించారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా స్పందించారు. జీడీపీపై విపక్షాలు, మాజీ అధికారులు చేసిన అంచనాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ కొంతమంది నిరుద్యోగులు తమను తాము ఆర్థికవేత్తలమని చెప్పుకొంటూ దేశానికి హాని చేయడానికి టీవీ చానెళ్లలో కనిపిస్తారని, దీనికి మోసపోకండి అని ఆయన ఆరోపించారు. సంబంధిత శాఖ మంత్రులు గణాంకాలను స్వయంగా తయారు చేయరని, ప్రతికూల దృక్పథం ఉన్నవారు తమ స్థాయిని తామే తగ్గించుకుంటున్నారని గోయల్ వ్యాఖ్యానించారు. వాస్తవాలను వక్రీకరించడం ద్వారా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని ఆయన విపక్షాలు, విమర్శకులను కోరారు.
జీడీపీ గణన విధానం లోపభూయిష్టం: గార్గ్
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైన దేశ జీడీపీ వృద్ధిరేటును నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. ఇన్నాళ్లూ జీడీపీ వృద్ధి గణనకు అనుసరించిన ‘బేస్ ఇయర్’ మారిన నేపథ్యంలో గార్గ్ వ్యాఖ్యలు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 7.8 శాతం జీడీపీ వృద్ధి చూడటానికి బాగానే ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితులను అది ప్రతిబింబిస్తున్నదా? అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు. నిజానికి ప్రస్తుత ధరల్లో దేశ జీడీపీ వృద్ధిరేటు 2.5 శాతంలోపే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం మోదీ సర్కార్ అనుసరిస్తున్న జీడీపీ గణన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, వాస్తవాలను మభ్యపెట్టేలా ఉందన్న రీతిలో గార్గ్ స్పందించారు. మరో సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో.. కొత్త సిరీస్‌కు మారిన తర్వాత 2023-24 జీడీపీ దాదాపు రూ.12 లక్షల కోట్లు తగ్గుతున్నదని చెప్పారు. ఈ స్థాయిలో దేశ జీడీపీ విలువ తగ్గుతున్నప్పుడు దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక వ్యవసాయం, గనుల రంగాల ప్రదర్శన బాగుంటే.. తయారీ రంగం మాత్రం కుదేలైందంటున్నారు. అసలు పాత, కొత్త జీడీపీ సిరీస్‌లలో ఏం మారింది? అన్నది అర్థం కావడం ఇప్పుడు ప్రధానమని పేర్కొన్నారు.