కాఠ్మాండూ, సెప్టెంబర్ 2 : ఇటీవల వరద విలయంతో విలవిల్లాడిన నేపాల్ దేశం గ్రీన్హౌస్ వాయువును భారీగా విడుదల చేసే భారత్, చైనా, అమెరికా దేశాల నుంచి నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది. ఉద్గారాలను భారీగా విడుదల చేస్తూ హిమాలయ దేశమైన నేపాల్లో జరిగిన వాతావరణ వినాశనానికి కారణమైన ఈ దేశాలు.. విలయానికి నైతిక బాధ్యత వహించాలని నేపాల్ పేర్కొంది. వాతావరణ సంక్షోభానికి, కాలుష్యానికి తమ వంతు పాత్ర చాలా తక్కువగా ఉందని, అలాంటప్పుడు దానివల్ల సంభవించే విపత్తుల ఆర్థిక భారాన్ని మోయాలని ఆశించరాదని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు. చారిత్రకపరంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో అమెరికా చాలా పెద్దవాటాను కలిగి ఉందని నేపాల్ పేర్కొంది. దీంతో తమ దౌత్యపరమైన విధానాన్ని సహాయం నుంచి న్యాయం, నష్టపరిహారానికి మారుస్తున్నట్టు తెలిపారు. ఇది దాతృత్వం కాదు. ఇది న్యాయ, నైతిక బాధ్యతలకు సంబంధించిన విషయం అని ఆయన అన్నారు.
నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలోని నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిలను దాటడంతో దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం నేపాల్ అధికారులు కోరారు. హైడ్రాలజీ అండ్ మెటియోరాలజీ విభాగానికి చెందిన వరద అంచనా విభాగం తెలిపిన వివరాల ప్రకారం సింధులి జిల్లాలోని సున్కోషి నది, గూర్ఖాలోని బుధి గండకి నది, దాడెల్ధురాలోని మహాకాళి నది సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి హెచ్చరిక స్థాయిలకు మించి ప్రవహిస్తున్నాయి.
వరదలతో అతలాకుతలమైన నేపాల్ కొండ ప్రాంతాల్లో డ్రోన్లు మృతదేహాలను కూడా మోసుకెళ్తున్నాయి. ‘ది కాఠ్మాండూ పోస్ట్’ బుధవారం ప్రచురించిన నివేదిక ప్రకారం సువాకోట్లోని దేవి ఘాట్-3 నుంచి దేవిఘాట్-5 వరకు డ్రోన్ల ద్వారా ఏడు మృతదేహాలను ఇటీవల ఎయిర్ లిఫ్ట్ చేశారు. రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా చేరుకోలేని కష్టమైన, ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి మృతదేహాలను డ్రోన్ల ద్వారా తరలించారు.