PM Modi : దేశ యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థే ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌ల (Startups) కథ ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. 20వ రోజ్‌గార్ మేళా సందర్భంగా శనివారం ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు కొత్తగా ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 51,000 మందికిపైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచిందన్నారు. గుర్తించబడిన స్టార్టప్‌లలో దాదాపు సగం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని చెప్పారు. ఇది భారతదేశ నూతన ఆర్థికవ్యవస్థలో గ్రామాలు, పట్టణాలు, చిన్న నగరాల నుంచి వచ్చిన యువత కూడా స్టార్టప్‌ల స్థాపనలో కీలకపాత్ర పోషిస్తున్నారని చూపిస్తోందని వివరించారు.
చిన్న పట్టణాలకు చెందిన యువత తమ సొంత ఆలోచనలతో కొత్త కంపెనీలను స్థాపిస్తూ తమతోపాటు ఇతర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ లక్ష్యంతోనే సుమారు రూ.1 లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందన్నారు.
మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతోపాటు కొత్త ఉద్యోగాలను సృష్టించే యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని మోదీ తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాబోతున్న నూతన ఉద్యోగులకు ప్రధాని కీలక సూచనలు చేశారు. మీరు మీ తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు దేశంలోని ఏ పౌరుడూ ఎదుర్కోకుండా చూడటమే మీ లక్ష్యం కావాలని ప్రధాని అన్నారు. ప్రభుత్వ సేవలో చేరిన వెంటనే ఈ మిషన్‌ను మీరు చేపట్టాలని పిలుపునిచ్చారు.
నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు. ఇందుకోసం ‘మిషన్ కర్మయోగి’ ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే 1.70 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ‘iGOT కర్మయోగి’ ప్లాట్ఫామ్లో చేరారని, కొత్తగా చేరేవారి కోసం ‘కర్మయోగి ప్రారంభ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశామని వివరించారు. మీరు మిమ్మల్ని ఎంతగా మెరుగుపరుచుకుంటే, దేశ పౌరులకు అంత మెరుగైన సేవలు అందించగలరని ప్రధాని చెప్పారు.