చెన్నై: తమిళనాడులోని దేవాలయాలలో స్మార్ట్ఫోన్లపై నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే కెమెరా లేని ఫోన్లను మాత్రం అనుమతించనున్నారు. ఆలయాల లోపల పలువురు భక్తులు.. దేవతా మూర్తులు, విగ్రహాలను ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నడిచే 52 ప్రధాన దేవాలయాల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంతో పాటు ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ అండ్ సీఈ శాఖ మంత్రి రమేష్ మాట్లాడుతూ కేవలం కెమెరాలేని సాధారణ ఫోన్లను మాత్రమే ఆలయాల లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు భక్తులు ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో దైవ దర్శనం చేసుకునేలా చూడటమే ఈ నిర్ణయంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.