హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి, ఓట్లేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ సర్కార్ వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ అడిగితే నిరుద్యోగులను లాఠీలతో రక్తాలు కారేలా సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులతో కొట్టించారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, యువతకు ఇచ్చిన హామీలపై ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఇక్కడి నాయకులను ఎవరూ నమ్మడం లేదని ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీని తీసుకొచ్చి అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులకు అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇప్పుడు అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చినా, సెంట్రల్ లైబ్రరీకి వచ్చినా.. నాడు దండాలు పెట్టి ఓట్లు వేయించిన నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీకి పిండాలు పెట్టేందుకు రెడీగా ఉన్నారని హెచ్చరించారు.
రాహుల్.. చూస్తున్నవా?
రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తుచేశారు. ‘జెన్ జీలతో రాహుల్‌గాంధీ ఢిల్లీలో పోజులు కొడుతున్నరు. మరి ఇకడ నీ సీల్డ్ కవర్ సీఎం ఏం చేస్తున్నడో గమనించావా? ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగాలని, బాయిలో దూకాలని అంటున్నడు. నోటిఫికేషన్లు అడిగితే తలకు మాసినోళ్లు అని బూతులు తిడుతున్నడు. జాబ్ క్యాలెండర్ అడిగితే లాఠీలతో రక్తాలు కారేట్టు పోలీసులతో కొట్టించాడు. అశోక్‌నగర్, చికడపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులపై లాఠీచార్జ్‌లు జరిపించాడు. జాబులు నింపుమని అడిగితే.. జేబులు నింపుకొనే పనిలో సీఎం, ఆయ న దండుపాళ్యం మంత్రుల బ్యాచ్ బిజీగా ఉన్నది’అని కేటీఆర్ మండిపడ్డారు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ లేదు.. ఉన్నది లుచ్చా కాంగ్రెసే అని విమర్శించారు.
విద్యార్థుల సమస్యలపై అవగాహన లేదు
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి విద్యార్థుల సమస్యలపై కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘ముఖ్యమంత్రికి చదువు రాదు. సంసారం అంతకంటే లేదు. పేద పిల్లలు సక్రమంగా చదువుకుంటే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన బాధ ఏమిటో అర్థం కావడం లేదు. కేసీఆర్ 1,022 గురుకులాలు పెడితే. వెయ్యి రోజుల్లో వెయ్యి గురుకులాలను నాశనం చేశారు. విద్యార్థులకు తిండి పెట్టే దికులేదు.
ఇప్పటివరకు 150 మంది గురుకుల విద్యార్థుల ఉసురు తీసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ‘మేము అధికారంలోకి వచ్చే నాటికి కాంగ్రెస్ సర్కార్ తాము 4వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టింది. భారం అనుకోకుండా ఏడాదికి 2వేల కోట్ల చొప్పన పదేండ్లు రూ.20వేల కోట్ల బకాయిలను కేసీఆర్ సర్కార్ చెల్లించింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు బకాయిలు చెల్లించడం లేదు. రూ.12వేలకోట్ల బకాయిలను ఈ ప్రభు త్వం ఇవ్వట్లేదు. పైగా ఫీజులు అడిగిన కాలేజీలను బెదిరిస్తున్నారు. భూములపై కన్నేసిన రేవంత్‌రెడ్డి ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టకొడుతున్నరు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
క్రైమ్ రేటులో రైజింగ్
తెలంగాణ రైజింగ్ నిజమేనని, కానీ క్రైమ్ రేటులో రైజింగ్ అవుతున్నదని ప్రభుత్వానికి కేటీఆర్ చురకలంటించారు. ప్రజాపాలనలో క్రిమినల్స్‌కు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రం లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహారాష్ట్ర నుంచి పోలీసులు వచ్చి రూ.1400 కోట్ల డ్రగ్స్ పట్టుకునే వరకు స్వయాన హోంమంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సమాచారం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. అందుకే కాంగ్రెస్ వైఫల్యాలపై అన్ని వర్గాల తరఫున చార్జ్‌షీట్ వేస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకుంటవా?
కేసీఆర్ రాజీనామా గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన పోరాటంతోనే రాష్ట్రం సిద్ధించిందని, రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ దక్కిందని స్పష్టంచేశారు. సింగపూర్‌ను నిర్మించిన లీ కువాన్ యూ మాదిరిగా కేసీఆర్‌ను ప్రజలు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకున్నారని, ఆయన రాజీనామా కోరే నైతిక అర్హత రేవంత్‌కు లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తకాదని, నాడు రాజీనామా చేస్తే మీ ఢిల్లీ పార్టీ వణికిందని, ఇప్పుడు రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి తట్టుకుంటారా? అని నిలదీశారు.
10వేల కోట్ల కుంభకోణంపై బీజేపీ ఎందుకు స్పందించదు?
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే కుట్ర జరుగుతున్నదని, యూనివర్సిటీ భూములపై కూడా రేవంత్ సర్కార్ కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. 27వేల పాఠశాలలను 4వేలకు కుదిస్తానని ముఖ్యమంత్రే స్వయంగా చెప్తున్నారని మండిపడ్డారు. ‘హెచ్‌సీయూ భూములు 400 ఎకరాలు గుంజుకుంటే విద్యార్థులు ఉద్యమించారు. వారికి మేము మద్దతుగా నిలిచాం. చివరికి సుప్రీంకోర్టు గ్రీన్బెంచ్ జోక్యం చేసుకొని భూములు తీసుకోవడానికి వీళ్లేదని ఒక ఎంపవర్డ్ కమిటీని నియమించింది.
ఆ కమిటీ వర్సిటీకి వచ్చి పరిశీలించి 400 ఎకరాలు తాకట్టు పెట్టి.. ఒక బ్రోకర్‌కు కమీషన్ ఇచ్చి రూ.10వేల కోట్లు అప్పు తెచ్చారని, రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఈడీ విచారణ చేయాలని కమిటీ రిపోర్టు ఇచ్చింది. విద్యార్థులపై ప్రేమ ఉన్నట్టు తొడలు, జబ్బలు చరుస్తూ దొంగ దీక్షలు నటిస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు స్పందించరు? వెంటనే సెంట్రల్ కమిటీ రిపోర్టుపై, రూ.10 వేల కోట్ల కుంభకోణంపై విచారణ చేయించాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.