BRS | హనుమకొండ, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకొంటున్నది. నాణ్యమైన విద్య, మెరుగైన పరీక్షల విధానం కోసం గళమెత్తిన విద్యార్థులపై కేంద్ర సర్కార్ కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నది.
నీట్ అక్రమాలపై గళమెత్తిన విద్యార్థుల డిమాండ్‌కు మద్దతుగా దేశంలోనే ప్రత్యక్ష పోరాటానికి దిగిన ఏకైక పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తున్నది. విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వ దాడులు, వేధింపులకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుని మరీ విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచే ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలని నిశ్చయించుకొన్నారు. విద్యార్థులు,యువతకు అభిమాన నాయకుడిగా పేరొందిన కేటీఆర్ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థుల తరుపున ప్రత్యక్షంగా ఉద్యమించేందుకు తన పుట్టిన రోజును సరైన సమయంగా ఎంచుకున్నారు. విద్యార్థుల పోరాటంలో కలిసి నడిచే కార్యక్రమానికి బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది.
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పత్రం లీక్ ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పరీక్షల నిర్వహణ సంస్థ నుంచే ఈ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. రాసిన పరీక్ష రద్దు రావడంతో దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీట్ పరీక్షను రెండోసారి నిర్వహించినప్పటికీ.. తమ వైఫల్యంతో లక్షల మంది విద్యార్థులకు ఆవేదన, ఆందోళన కలిగించిన కేంద్రంపై విద్యార్థి లోకం భగ్గుమన్నది. పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు దేశం నలుచెరుగులా వెల్లువెత్తాయి. రెండు నెలలుగా ఈ డిమాండ్లతో నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ కేంద్రంగా గత నెల 20 నుంచి విద్యార్థులు భారీ ఉద్యమం చేపట్టారు. దేశంలోనే అతి పెద్ద ఉద్యమంగా నిలుస్తున్న ఈ ఉదంతంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విద్యార్థులకు దూరంగా ఉంటూ వచ్చాయి. చేసిన తప్పునకు బాధ్యత వహించాల్సిన బీజేపీ.. పోలీసు దాడులతో సమాధానం ఇచ్చింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల గోడు అసలే పట్టించుకోలేదు.
ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా కోట్లాదిమంది ప్రజలు ముఖ్యంగా జెన్జీలు అండగా నిలుస్తున్నారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముందుండి పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ తొలుత పట్టించుకోలేదు. విద్యార్థుల పోరాటం తీవ్రమై నెత్తురు చిమ్మడంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఆరాటపడింది. ఉద్యమం చేస్తున్న విద్యార్థులను కలవకుండా, వారికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించకుండా… తనకు అలవాటైన ఓట్ల రాజకీయం కోసం ప్రయత్నించింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థులను కాదని ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నాకు ప్రయత్నించారు. ముందుగా ఒప్పందం జరిగిందా? అన్నట్టు విద్యార్థుల ఉద్యమాన్ని కాకుండా… రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ నిరసన ముఖ్యమైనది అన్నట్లుగా బీజేపీ ప్రభుత్వం కూడా వ్యవహరించింది.
హడావుడి చేసి వారిని అరెస్టు చేసి విద్యార్థుల ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించినట్టు బీజేపీ నడుచుకొంది. విద్యార్థుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అటు అధికారంలోని బీజేపీ, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ కలిసి ఆడిన ఈ నాటకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాహుల్ అరెస్టుకు కొనసాగింపుగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సొంత కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థుల ఉద్యమంతో, వారి డిమాండ్లతో సంబంధం లేకుండా… రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అరెస్టును మాత్రమే నిరసిస్తూ అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ ధర్నాలు చేపట్టింది. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అరెస్టుపైనే నిరసన వ్యక్తం చేశారు తప్ప ఎక్కడా విద్యార్థుల డిమాండ్లనుగానీ, వారిపై బీజేపీ ప్రభుత్వ దమనకాండను గానీ ప్రస్తావించలేదు.
బీఆర్ఎస్ తెలంగాణ ఆకాంక్ష సాధన కోసమే పుట్టింది. విద్యార్థుల ఉద్యమాలతో కలిసినడిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రభాగాన నడిచింది. ఆవిర్భావం నుంచి అన్ని రకాల సహేతుకమైన ఉద్యమాలలో ఎప్పటికప్పుడు భాగస్వామి అవుతున్నది. 13 ఏండ్లు ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఆకాంక్షల కోసం పోరాటం చేసింది. అధికార పార్టీగా విద్యార్థులు, యువత ప్రయోజనాల కోసం పరిపాలన సాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విద్యా, ఉద్యోగాలలో యువతకు చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ నిరంతరం విద్యార్థులతో కలిసి పోరాడుతున్నది. రాష్ట్రంలోని విద్యార్థులు, యువత తమ ఆలోచనలు, ఆవేదనలను పంచుకునే ఏకైక పార్టీగా బీఆర్ఎస్ ఉంటున్నది. ఇదే స్ఫూర్తితో విద్యార్థుల ఉద్యమంలో కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా భాగస్వామి అవుతున్నారు. దక్షిణాది నుంచి ప్రత్యక్ష కార్యాచరణ తీసుకున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్సే!
ఈ దశలో పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. అయితే, బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల నిరసనను సహించలేకపోయింది. ఈ క్రమంలో విద్యార్థులపై దమనకాండకు తెగబడింది. పోలీసులతో ఇష్టారాజ్యంగా విద్యార్థులపై దాడులు చేయించింది. విద్యార్థులపై పోలీసుల లాఠీలు విరిగాయి. భాష్పవాయు గోళాలు విరుచుకుపడ్డాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ, విద్యార్థులపై జరుగుతున్న ఈ అణచివేతను ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి తప్ప పట్టించుకోలేదు. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ముందుకు వచ్చింది. విద్యార్థుల ఉద్యమానికి కలిసి నడువాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంతవరకు ఢిల్లీలోనే ఉంటున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియాసూలే విద్యార్థులను కలిసి మద్దతు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి మీడియా ద్వారా సంఘీభావం తెలిపారు. ఇతర ఏ రాజకీయ పార్టీలు విద్యార్థులతో భుజం కలుపలేదు. విద్యార్థుల పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామి అవుతూ ఉద్యమిస్తున్న ఏకైక పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే నిలిచింది.
మొదట నుంచీ యువతకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచి విలువైన వర్సిటీ భూములను కాపాడింది. పోలీస్ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నవారికి అండగా నిలిచింది. న్యాయస్థానంలోనూ, బయటా నిరుద్యోగుల సాగించిన పోరాటానికి వెన్నుదన్నుగా నిలబడ్డది బీఆర్ఎస్సే. విషాహారంతో గురుకుల మరణాల ఘటనలపైనా పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్సే. మొన్నటికిమొన్న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించి యువతకు భరోసా నిచ్చింది బీఆర్ఎస్సే!
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలి. జెన్‌జీని విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయ్. నేపాల్, శ్రీలంక తరహాలో ఇండియాలోనూ జెన్‌జీ ఉద్యమాలు రాబోవని చెప్పలేం. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయ్.
– ఎన్డీటీవీ యువ కాంక్లేవ్‌లో మాజీమంత్రి కేటీఆర్ (20.09.2025)
నాడు కాంగ్రెస్ అసమర్థ విధానాలతో దేశం బ్రెయిన్ డ్రెయిన్ అయిపోతే.. బీజేపీ అసమర్థ పాలనతో క్యాపిటల్ డ్రెయిన్ అవుతున్నది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఇండియా రియాక్ట్స్. ఇండియా ఓ తెలివైన దేశం. అవసరమైనప్పుడు కచ్చితంగా ఇండియా రియాక్ట్ అవుతుంది. ఇండియాకు రియాక్ట్ అయ్యే ఆ కెపాసిటీ ఉన్నది. మౌనంగా చూస్తూ ఈ దేశం కూర్చోదు.
యువకుల్లారా! ఈ దేశం మీది. భవిష్యత్తు మీది. మీరు కాపాడుకోవాలి. దేశంలో ఉన్న ప్రతి మేధావికి, రచయితకు, కవికి, కళాకారునికి, జర్నలిస్టు లోకానికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. చెడుపై ఎక్కడో ఓ చోట పోరాటం మొదలు కావాలి. బీజేపీ అరాచకాలను, దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే ఈ దేశం తప్పకుండా సర్వనాశనమైతది. ఎటూ కాకుండాపోతది.
-(10.07.2022న కేసీఆర్ వ్యాఖ్యలు)