దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నేడు ఒక నూతన పోరాటం మొదలైనట్టు అక్కడి పరిస్థితి చూస్తే అర్థవుతున్నది. ఈ పోరాటం కేవలం పాలకులపై మాత్రమే కాదు, పాలకులకు భజన చేస్తూ ప్రజల గొంతును తొక్కిపెడుతున్న ‘గోదీ మీడియా’ వైఖరిపై కూడా! అని తేటతెల్లం అవుతున్నది. హక్కుల కోసం, న్యాయం కోసం వీధిలోకి వచ్చిన విద్యార్థులు, డిజిటల్ యుగంలో పెరిగిన ‘జెన్ జీ’ యువత నేడు మైకులు, కెమెరాలతో కవరేజీ ఇస్తున్న జర్నలిస్టులను నేరుగా నిలదీస్తున్నారు. ‘గోదీ మీడియా గో బ్యాక్” అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జర్నలిజం ముసుగులో జరుగుతున్న వికృత ప్రచారాన్ని నిరసిస్తూ కెమెరాలు, మైకులను తరిమికొడుతున్నారు.
నిజాన్ని దాచేకొద్దీ అది నిప్పులా ప్రకాశిస్తుందనేది జగమెరిగిన సత్యం. స్వాతంత్య్ర పోరాటానికి ముందు నుంచే మన దేశంలో పత్రికలు ప్రజల వైపే నిలిచాయి. ఆనాడు బ్రిటిష్ పాలకులు ఎంత ఒత్తిడి తెచ్చినా, హింసకు పాల్పడినా వెరవకుండా స్వాతంత్య్ర సమరయోధులు పత్రికలను ప్రజల చైతన్యం కోసం, న్యాయం కోసం నడిపారు. కానీ, నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రూటు మార్చిన పత్రికలు, మీడియా రంగం ఇటీవలికాలంలో మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ హయాంలో తమ స్వతంత్రతను పూర్తిగా తాకట్టు పెట్టాయి. ప్రభుత్వాలు విసిరే ప్రలోభాలు, ఎరలకు లొంగిపోయిన ప్రధాన స్రవంతి మీడియా ప్రజా సమస్యలను గాలికొదిలేసి పాలకుల పాదసేవకే పరిమితమవుతున్నది. కార్పొరేట్ శక్తులు డబ్బులిచ్చి మీడియాతో చిలుకపలుకులు పలికిస్తుంటే, నిజాన్ని బతికించాల్సిన జర్నలిజం చచ్చిపోతున్నది.
గతంలో ఈశాన్య రాష్ర్టాలు, కశ్మీర్లో జరిగిన పోరాటాలపై తప్పుడు కథనాలు అల్లినట్లే.. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ మీడియా తీవ్ర వివక్ష చూపింది. ఎంతోమంది బలిదానాల అనంతరం ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఒక రాజకీయపార్టీని మొదలు పెడితే అంతంతమాత్రంగానే వార్తల కవరేజీ ఇచ్చేవారు. నాడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు, తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ప్రజల ఉద్యమం రగులుతుంటే, మీడియా మాత్రం కేసీఆర్ వార్తలు, ఉద్యమ కవరేజీని కావాలనే కుదించింది. అనేక రకాల తప్పుడు వార్తలను ప్రసారం చేసి కేసీఆర్ పట్ల, ఉద్యమం పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడేలా చేసింది. స్వరాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులకు ‘వేర్పాటువాదులు’ అని రంగు పూసి వికృత కథనాలు అల్లింది. ప్రజల సత్యమైన ఆకాంక్షను తొక్కేసి హేళన చేసిన మీడియా వైఖరిపై ఆనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఫలితంగా ఓబీ వ్యాన్లను తగులబెట్టారు, ప్రసారాలను అడ్డుకున్నారు, దాడులకు దిగారు. చివరకు సీమాంధ్ర మీడియాలో పనిచేసే తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు సైతం సామాన్య ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయలేక, పోలీసుల రక్షణలో ఉండి వార్తలను రిపోర్ట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆ తర్వాతకాలంలో జెన్ జీ
యువత చైతన్యవంతమై సోషల్ మీడియా వేదికగా నిజానిజాలను వెలికితీయడం ప్రారంభించాక కూడా మీడియా తన తీరును మార్చుకోకపోవడం మరింత అసహనాన్ని పెంచింది. ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతుల సుదీర్ఘ నిరసనలో అన్నదాతలను ‘దేశద్రోహులు’గా చిత్రీకరించడం, ఆపరేషన్ కగార్ వంటి మిలిటరీ చర్యల సందర్భాల్లో మహిళల పట్ల ప్రవర్తించిన తీరుపై కథనాలను తొక్కిపెట్టింది.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ర్టాల్లోని విలువైన అటవీ సంపదను అదానీ లాంటి వారికి కట్టబెడుతుంటే భూసేకరణకు వ్యతిరేకంగా వేలాదిమంది రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలిపారు. కానీ సదరు మీడియా కనీసం దానిని కవర్ చేయకుండా బ్లాకౌట్ చేయడం లాంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆక్రోశాన్ని నింపాయి. దేశ ఆర్థిక పురోగతి క్షీణించడానికి, ప్రజాధనం లూటీ కావడానికి కారణమైన బడా వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్లను మీడియా కావాలనే వదిలేస్తూ, వారి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టిన తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరీ దిగజారింది. టీవీ డిబేట్లు, ఇంటర్వ్యూల పేరిట ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టడం, హక్కుల కోసం పోరాడుతున్న వారిని టీవీ స్టూడియోల్లో ‘మీరే దేశద్రోహులు’ అని నిలదీయడం నిత్యకృత్యమైంది. ఇదంతా స్వతంత్రంగా జరుగుతున్న జర్నలిజం కాదని, వారి వెనుక ఉండి ప్రభుత్వం ఆడించే కుట్రపూరిత క్రీడ అని విద్యార్థులు బలంగా భావిస్తున్నారు. అందుకే ఈ వికృత క్రీడను నిరసిస్తూ, పక్షపాత జర్నలిజానికి అలవాటుపడిన, దిగజారిన మీడియాను విద్యార్థులు నేడు నడిబజారులో నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులు మీడియా దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయి. లైవ్ ఇస్తున్న ఒక ఆంగ్ల చానల్ రిపోర్టర్ తమ ఉద్యమాన్ని కించపరుస్తున్నాడని గ్రహించిన విద్యార్థులు అతన్ని చుట్టుముట్టి దాడులకు సైతం వెనుకాడలేదు. ‘మీరంతా దేశద్రోహులంట కదా?’ అని హేళనగా అడిగిన ఒక మహిళా రిపోర్టర్‌పై మహిళా విద్యార్థులే విరుచుకుపడి తరిమికొట్టారు. విద్యార్థుల ఆగ్రహాన్ని గమనించిన మరో రిపోర్టర్ ఏకంగా పోలీస్ జీపు వెనుక దాక్కుని కవరేజీ చేయడానికి ప్రయత్నించే గతిమాలిన పరిస్థితి దాపురించింది. మెయిన్‌స్ట్రీమ్ మీడియా ప్రతినిధి కనిపించగానే విద్యార్థులు ‘గోడీ మీడియా హై హై’ అంటూ ర్యాగింగ్ తరహాలో అవమానిస్తూ వెంటబడుతున్నారు. అయితే ఈ భయానక వాతావరణానికి కారణం క్షేత్రస్థాయిలో కష్టపడే సాధారణ జర్నలిస్టులు కాదు, ప్రభుత్వాలతో కుమ్మక్కై, సొంత లాభాల కోసం జర్నలిజం విలువలను తాకట్టు పెట్టిన మీడియా యాజమాన్యాల తీరే నేడు జర్నలిజాన్ని బోనులో నిలబెట్టింది. పాలకుల మెప్పుకోసం పదే పదే అబద్ధాలు ప్రచారం చేయడం అలవాటుగా మారినపుడు, భవిష్యత్తులో మీడియా ఏదైనా నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు ముందుగా గ్రహించాలి. జర్నలిజంలో అత్యం త విలువైనది విశ్వసనీయత. ఒకసారి ఆ విశ్వసనీయతను కోల్పోతే, ఆ తర్వాత ఎన్ని రకాల ప్రకటనలు చేసినా సమాజంలో ఆ మీడియాకు ఉనికి లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఫోర్త్ ఎస్టేట్ పాలకుల భజన బృందంగా మారితే, అది మీడియాకు ఆత్మహత్యతో సమానం.
నేడు ఢిల్లీ వీధుల్లో రగులుతున్న ఆగ్రహం, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ యుద్ధం మొత్తం మీడియా రంగానికి ఒక గట్టి హెచ్చరిక. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేవలం అధికార పీఠాన్ని సంతృప్తిపరచడమే ధ్యేయంగా పెట్టుకుంటే ప్రధాన స్రవంతి మీడియాను ప్రజలే పూర్తిగా తిరస్కరిస్తారు. ఇప్పటికైనా ‘గోడీ మీడియా’ తన వైఖరిని మార్చుకుని, ప్రభుత్వం దారితప్పకుండా ప్రశ్నించే నిజమైన ‘ఫోర్త్ ఎస్టేట్’గా నిలబడాలి. లేకపోతే, రాబోయే చరిత్ర మిమ్మల్ని సమాజానికి మేలు చేసిన జర్నలిస్టులుగా కాకుండా ‘ప్రజాస్వామ్య ద్రోహులు’గానే గుర్తుంచుకుంటుంది.
-క్రాంతి కిరణ్