– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 21 : గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రసాయన పరిశ్రమలు తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నరసింహ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కెమికల్ పరిశ్రమల వ్యర్ధాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కలుషితం వల్ల తాగునీటి సమస్యతో పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. పరిశ్రమల కాలుష్యంతో క్యాన్సర్, చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మరోపక్క వ్యవసాయం కూడా దెబ్బతిని పంట నష్టం జరుగుతుందన్నారు.
దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా రైతులు ప్రతీ సీజన్‌కు పంట నష్టపోతున్నారన్నారు. ఈ కెమికల్ పరిశ్రమల వల్ల పాడి రైతులు, కూరగాయల రైతులు, పండ్ల తోటల రైతులతో పాటు గీత కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమల వల్ల నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, తమ జీవనోపాధి, జీవితాలనే కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారన్నారు. పరిశ్రమల యజమానులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాయు, జల కాలుష్యం చేస్తున్నారని దీనిని నియంత్రించాల్సిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని లేకపోతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేష్, మండల మాజీ కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి ముద్దం సత్తయ్య, సీపీఎం నాయకులు గుర్రం రామచంద్రారెడ్డి, వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, పోన్నమోని కృష్ణ, పగిళ్ల వేణుగోపాల్ రెడ్డి, యాస మల్లారెడ్డి, పగిళ్ల పాండురెడ్డి, చుక్క రజినీకాంత్ పాల్గొన్నారు.